శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (15:28 IST)

సంక్రాంతి రోజున విష్ణుసహస్రనామ పఠనం.. పితృదేవతలకు పూజ తప్పనిసరి!

సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణు సహస్రనామ పఠనం చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంక్రాంతి రోజున విష్ణుసహస్ర నామాన్ని జపించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. 
 
సంక్రాంతి రోజున చేసే స్నానాలు, దానాలు, జపాలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయి. అలాగే సంక్రాంతి రోజు గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. ఇంకా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు, దానాలు చేయడం ఉత్తమం. సంక్రాంతి రోజు స్నానం చేయని వారికి రోగాదులు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏ ఏ దానాలు చేస్తామో అవి జన్మజన్మలకి పుణ్యఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు.
 
ఈ పుణ్య కాలంలో తిలలు, బియ్యం కలిపి శివారాధన చేయడం, ఆవు నేతితో అభిషేకం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యంగా ఆచరించవలసిన విధి. వీటిని సంక్రాంతి రోజున మరువకూడదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.