ఆ కొలనులో గాజులు ధరించిన చేయి అటూఇటూ ఊగుతూ కనిపించింది... ఆమె ఎవరో తెలుసా?
తపోశక్తితో నారాయణుని పుత్రుడుగా పొందవచ్చు. అలాగే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవిని కుమార్తెగా కూడా పొందవచ్చు. ఇలాంటి నిదర్శనానికి ఉదాహరణే ఇది. కామార్ప్‌కూర్ వెళ్ళే దారిలో రహదారి ప్రక్కన రంజిత్ రాయ్ కు చెందిన పెద్దకొలను ఒకటి ఉంది. రంజిత్ రాయ్ ఇంట్లో జగజ్జనని అతని కుమార్తెగా జన్మించింది. ఆమె గౌరవార్ధం ఇప్పుడు కూడా అక్కడ చైత్ర మాసంలో జాతర జరుగుతుంది. ఆమె జగజ్జననిగా ఎలా మారిందో తెలుసుకుందాం.
రంజిత్ రాయ్ అక్కడ జమిందార్. తపోశక్తి ద్వారా జగజ్జననిని కుమార్తెగా పొందాడు. కుమార్తె అంటే అతనికి ఎంతో అనురాగం. ఆమె కూడా ఎప్పుడూ తండ్రిని అంటిపెట్టుకొని ఉండేది. అతనిని వదిలేదికాదు. ఒకరోజు రంజిత్ రాయ్ తన జమీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పసిపిల్లలకు సహజమైన స్వభావంతో, నాన్నగారు అదేమిటి, ఇదేమిటి అని అంటూ విసిగిస్తుంది. రంజిత్ రాయ్ మంచి మాటలతో ఆమెకు నచ్చజెప్పాలని చూశాడు. ఆమెతో అమ్మ ప్రస్తుతం నీవు వెళ్లు. నాకెన్నో పనులున్నాయి అన్నాడు.
కాని ఆ అమ్మాయి వదలడం లేదు. చివరకు రంజిత్ రాయ్ అన్యమనస్కంగా నీవు ఇక్కడ నుంచి వెళ్లిపో అనేశాడు. అదే సాకుతో ఆమె ఇంటిని వదిలి పెట్టి వెళ్లిపోయింది. ఆ సమయంలో గాజులు అమ్మేవాడొకడు దారిలో పోతున్నాడు. ఆ అమ్మాయి అతనివద్ద కొన్ని గాజులు తీసుకొని ధరించింది. డబ్బు అడిగేసరికి, ఇంట్లో ఫలానా పెట్లో డబ్బులున్నాయి అని చెప్పి ఆమె అక్కడనుంచి వెళ్లిపోయింది. గాజులు అమ్మేవాడు రంజిత్ రాయ్ ఇంటికి వచ్చి గాజులకు డబ్బులు ఇవ్వమన్నాడు.
అమ్మాయి ఇంట్లో కనిపించకపోయేసరికి వాళ్లు గాబరా పడి నాలుగువైపులా వెతకనారంభించారు. గాజులు అమ్మేవాడికి ఇవ్వవలసిన డబ్బు ఆ అమ్మాయి చెప్పినట్లు పెట్టెలో ఉంది. రంజిత్ రాయ్ భోరున విలపించసాగాడు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి కొలనులో ఏదో కనిపిస్తుంది అని చెప్పాడు. అందరూ కొలను వద్దకు వెళ్లి చూసేసరికి గాజులు ధరించిన చేయి ఒకటి నీటిపైన అటూ ఇటూ ఊగుతూ కనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత మరేమి కన్పించలేదు. ఇప్పుడు కూడా అక్కడ ప్రజలు జాతర నాడు ఆమెను జగజ్జననిగా ఆరాధిస్తారు.