శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 జనవరి 2016 (17:52 IST)

లంకలో హనుమంతుడు సీతను చూచుట.. వాడిపోయిన శరీరఛ్చాయతో దయనీయ స్థితిలో..!?

లంకలో రావణాసురుని భవనము అన్ని వీధులు అన్నిప్రాంతములు సీత కొరకు వెదుకుచుండగా చివరికి దేవేంద్రుని నందనము వలె కుబేరుని విచిత్ర చైత్రరధమువలె, అన్ని ఉద్యానములనూ మించినట్టి శ్రేష్ఠమైన అశోకవనమును హనుమంతుడు జూచెను. ఆ ఉద్యానవన ఊహించుటకు కూడా శక్యము కాని విధమున సుందరముగా శోభించుచుండెను. 
 
నక్షత్రగణములవంటి పుష్పములతోను రెండవ ఆకాశము వలె రత్నముల వంటి వందలాది పుష్పములతో రెండవ సముద్రమువలె కనబడుచుండెను. అన్నిఋతువులందును లభించు పుష్పములతోను, తేనెల సువాసనలతో కూడిన వృక్షములతోనూ నిండి ఉండెను. అక్కడ, మృగములు పక్షులు అనేక విధములైన ధ్వనులు చేయుచుండెను. సుగంధములతో నిండి మనోహరముగానున్న ఆ ఉద్యానవనములో  అనేక విధములగు గంధములు ప్రవహించుచున్నట్లు ఉండెను.
 
హనుమంతుడు ఆ అశోకవనమధ్యమునందు తానున్నవృక్షమునకు దగ్గరగా సుగంధభరితమై రెండవ గంధమాదన పర్వతమువలె ఉన్న, ఉన్నతమైన చైత్యప్రాసాదమును చూసెను. కైలాసమువలె తెల్లగా ఉన్న ఆ ప్రాసాదము వేయిస్తంభములపై నిలిచియుండెను. దానియందు పగడములతో మెట్లూ శుద్ధమైన బంగారముతో తిన్నెలు ఏర్పరుపబడి ఉండెను. కాంతితో ప్రజ్వలించుచున్న ఆ ప్రాసాదము కనులకు మిరుమిట్లు కొలుపుచుండెను. నిర్మలమైన ఆ ప్రాసాదము అత్యున్నతమగుటచే ఆకాశమును ఒరయుచున్నట్లు ఉండెను. 
 
ఇంతలో హనుమంతునకు, మలినమైన వస్త్రములు చుట్టబెట్టుకుని రాక్షసస్త్రీల మధ్య ఒక యువతి కనబడెను. ఆహారము తినకపోవుటచే కృశించి, దీనురాలై ఆమె మాటిమాటికి నిట్టూర్చుచుండెను. శుక్లపక్ష ప్రారంభమునందలి చంద్రరేఖవలె నిర్మలముగా, సన్నగా ఉండెను. 
 
ఆమె రూపవతియే యైనను ఆ రూపము స్పష్టముగా కనబడుటలేదు. అందుచేత ఆమె పొగలో కప్పబడిపోయిన అందమైన కాంతిగల అగ్నిజ్వాలవలె ఉండెను. ఏ అలంకారములూ లేని ఆమె నలిగిపోయిన ఒక పచ్చని ఉత్తమవస్త్రమునకు శరీరమునకు చుట్టబెట్టుకొని పద్మములు లేనిదీ, బురదతో కూడినదీ అయిన పద్మలత వలె ఉండెను. దుఃఖపీడితురాలై, వాడిపోయిన శరీరఛ్చాయతో దయనీయ స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తలవంచుకుని కూర్చుండెను. అంగారక గ్రహముచేత పీడింపబడిన రోహిణీ నక్షత్రము వలె కాంతిశూన్యురాలై ఉండెను. 
 
ఆమె కన్నీళ్ళు కారుచున్న ముఖముతో దీనురాలై, ఆహారము భుజించకపోవుటచేత కృశించి ఉండెను. తొలగని దైన్యముతో, శోకముచేత ఏమేమో ఆలోచనలలో మునిగి దుఃఖక్రాంతురాలై ఉండెను. తనకు కావలసిన బంధుజనమెవ్వరూ కనబడక, రాక్షసగుణముచే నిరంతరమూ చూస్తూ వాళ్ళ మధ్యనున్న ఆమె స్వజాతీయములైన లేళ్లకు దూరమై, కుక్కల గుంపు చుట్టుముట్టిన ఆడలేడివలె ఉండెను. నడుము వరకు వేలాడుచున్న, నల్లత్రాచు వంటి జక్క జడతో, ఆమె వర్షాకాలాంతము నందు నల్లని వృక్షపంక్తితో కూడిన భూమివలె ఉండెను. ఎన్నడూ ఇట్టి కష్టములనుభవించి ఎరుగక, సుఖములనుభవించుటకే తగిన ఆమె దుఃఖముచే పీడితురాలై ఉండును. 
 
పూర్తిగా మాసిపోయి, కృషించియున్న ఆ విశాలాక్షియైన యువతిని చూచి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీతయై ఉండునని ఊహించెను. ఆనాడు కామరూపియైన ఆ రాక్షసునిచే అపహరించబడుతున్న స్త్రీ ఎట్టి రూపముతో ఉండెనో, అట్టి రూపముతోనే ఈ స్త్రీ ఉన్నది. హనుమంతుడు అక్కడ పూర్ణచంద్రుని వంటి ముఖము, అందమైన కనుబొమ్మలు, సుందరములు వర్తులాకారములూ అయిన పయోధరములూ గల సీతను చూచెను. దేదీప్యమానముగా ఉన్న ఆమె కాంతిచేత అన్ని దిక్కులనుండీ చీకటిని పోగొట్టుచుండెను. నల్లని కేశములు, దొండపండు వంటి పెదవులు, అందమైన నడుము, పద్మపత్రముల వంటి నేత్రములు గల ఆ సీత మన్మథుని భార్యయైన రతివలె ఉండును. ఆమె పాతివ్రత్యధర్మమునందు స్థిరముగా నిలిచి ఉండెను. 
 
పూర్ణచంద్రుని కాంతివలె ఆమె సకల ప్రాణులకును ఇష్టురాలైనది. మంచి శరీరముగల ఆమె నియమము పాటించుచున్న ఒక తాపసివలె నేలపై కూర్చుండెను. ఆమె భయపడుచున్న ఆడసర్పము వలె అధికముగా నిట్టూర్చుచుండెను. అత్యధికమైన దుఃఖ సముదాయములో చిక్కుకొని యుండుటచేత ప్రకాశవిహీనురాలై ఉండెను. ఆమె ధూమముతో కలిసిపోయిన అగ్ని జ్వాలవలె, సందేహముతో నిండిన స్మరణశక్తివలె, నశించిన సమృద్ధివలె, దెబ్బతిన్న శ్రద్ధవలె, అడ్డుతగిలిన ఆశవలె, విఘ్నము కలిగిన కార్యసిద్ధివలె, కాలుష్యముతో కూడిన (నిర్మలము లేని) బుద్ధివలె ఉండెను. రామునకు కలిగిన కష్టములకు వ్యథ చెందుచు, రావణునిచే అపహరించబడుటచే కృశించిపోయిన ఆమె అసత్యములైన దోషములు ఆరోపించుటచే దెబ్బతిన్న కీర్తివలె ఉండెను. 
 
లేడి కళ్ళవంటి కళ్లు గల ఆమె కన్నీళ్లతో నిండిన, నల్లని వంకరయైన కనురెప్పలుగల, కలతచెందిన ముఖముతో ఇటునటు చూచుచుండెను. మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండెను. స్నానాది సంస్కారములు లేకపోవుటచే ఆమె శరీరము మాలిన్యముతోను, పంకముతోను నిండియుండెను. అలంకరించుకొనుటకు తగిన ఆమె ఎట్టి అలంకారములూ లేక దీనురాలై, నల్లని మేఘములచే కప్పివేయబడిన చంద్రుని కాంతివలె ఉండెను. 
 
సరియైన ఆవృత్తులు చేయకపోవుటచే గట్టిపడని విద్యవలె ఉన్న ఆమెను చూచిన హనుమంతుని మనస్సులో ఈమె సీతయా కాదా అను సందేహము మాటిమాటికి ఉదయించెను. సంస్కారము లేకపోవుటచే చెప్పదలచిన అర్థమునకు భిన్నముగా మరొక అర్థము బోధించు వాక్కును శ్రమపడి అర్థము చేసికొన్నట్లు హనుమంతుడు, అలంకారహీనయై ఉన్న ఆ సీతను అతికష్టము మీద గుర్తించెను. 
 
విశాలములైన నేత్రములుగల, దోషరహితురాలైన ఆ రాజకుమారిని చూసి, హనుమంతుడు, యుక్తియుక్తములైన హేతువులచే, ఆమె సీతయే అని ఊహించెను. ఆనాడు రాముడు, సీత శరీరము మీద ఏయే అలంకారములున్నవని చెప్పెనో ఆ అలంకారములు ఆమె అవయవములమీద ప్రకాశించుచుండెను. చక్కగా తయారుచేసిన కుండలములు, బాగుగా అమరి ఉన్న శ్వదంష్ట్రములను కర్ణాభరణములూ, హస్తములపై ధరించుమణులతోను, పగడములతోను, విచిత్రమైన ఆభరణములూ, వీటినన్నింటినీ హనుమంతుడు చూసెను. చాలాకాలము పాటు తీయకుండా సీత శరీరముమీదనే ఉండుటచే అవి కొంచెము మాసిపోయెను. వాటి ముద్రలు కూడా ఆమె అవయవములపై పడెను. 
 
రాముడు చెప్పిన అలంకారములు ఇవి అని తలచెదను. రావణుడుతనను అపహరించబడినప్పుడు సీత కొన్ని అలంకారములు తీసి క్రింద పడవేయుటచే తరగిపోయిన అలంకారములు ఇక్కడలేవు. తరగనివి (ఆమె క్రిండపడవేయనివి) ఇవే. సంశయము లేదు.
 
బంగారు పట్టీవలె పచ్చగా ఉన్న మంగళప్రదమైన, ఆ ఉత్తరీయాంశుకము సీత జారవిడువగా పర్వతము మీద పడినపుడు దానిని ఆనాడు వానరులు చూచినారు. ఈమెయే పడువేయగా చప్పుడు చేయుచూ నేలపై పడిన, అమూల్యమైన ప్రధాన భూషణములను కూడా వానరులు చూచినారు. ఈమె ధరించిన ఈ వస్త్రము చాలా కాలము నుంచి కట్టుకొనుటచే చాలా నలిగిపోయింది. అయినను దాని (ఉత్తరయము) రంగు దీని రంగూ ఒక్కటే. అది ఎంత శోభాయుక్తమైనదో ఇది కూడా అంత శోభాయుక్తమై ఉన్నది. 
 
బంగారువన్నె శరీరముగల ఈమె రాముని ప్రియురాలైన సీతయే. రావణుడు అపహరించుటచే ఈమె కనబడకపోయినా రాముని మనస్సులో మాత్రమే ఈమె స్థిరముగా నిలిచి వున్నది. ఎవ్వతెకోసమే రాముడు జాలి, దయ, శోకము, కామము అను నాల్గింటితో బాధపడుచున్నాడో ఆమె ఈమెయే. కనబడకుండ పోయినది స్త్రీ కదా అని జాలి, ఆమెకు నేను తప్పమరెవ్వరూ రక్షకులు లేరు కదా అని దయ, కనబడకుండ పోయినది భార్య అగుటచే శోకము, ఆమె ప్రియురాలగుటచే కామము ఈ నాల్గింటితో బాధపడుచున్నాడు. 
 
ఈ దేవిరూపము, దేహ-దేహావయముల చక్కదనము ఎట్లున్నవో రాముని రూపము, అతని అంగప్రత్యంగముల చక్కదనం కూడా అట్లే ఉన్నవి. నల్లని నేత్రములు గల సీత రూపము ఆ రాముని రూపమునకు తగి ఉన్నది. ఈ సీతాదేవి మనస్సు రామునిపై స్థిరముగా లగ్నమై ఉన్నది. ఆ రాముని మనస్సు కూడా ఈమెపై స్థిరముగా లగ్నమై ఉన్నది. అందుచేతనే ఈ సీతాదేవీ, ధర్మాత్ముడైన రాముడూ, ఒకరిపై ఒకరు ఆశపెట్టుకొని క్షణకాలమైనా జీవించగలుగుతున్నారు. 
 
ఈ సీతనుండి దూరమైన పిమ్మట కూడా రాముడు ప్రాణములతో ఉండగలిగినాడు. మరణించలేదు. అనగా ఆ ప్రభువు నిజముగా చేయశక్యము కాని పనిచేయుచున్నాడు కదా! నల్లని కేశములు, పద్మపత్రముల వంటి నేత్రములుగల ఈమె సుఖములను అనుభవించుటయే యుక్తము. అట్టి ఈమెకు కూడా కలిగిన ఈ కష్టము చూసి, ఈమెతో ఎట్టి సంబంధములేని మధ్యస్థుడనైన నా మనస్సు కూడా బాధపడుచున్నది. 
 
భూమివలె ఓర్పుగలదీ, పద్మములతో సమానములైన నేత్రములు కలదీ అయిన ఏ సీతను రామలక్ష్మణులు రక్షించుచుండెడివారో ఆమెనే ఇప్పుడు రాక్షసస్త్రీలు వృక్షమూలమునందు కూర్చండబెట్టి కాపలా కాయుచున్నారు. కష్టములు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిపడి పీడించుచుండగా, ఈ సీత మంచు దెబ్బతిన్న తామరపూల తీగవలె కాంతి కోల్పోయినదై, మగచక్రవాకము ప్రక్కనలేని ఆడచక్రవాక పక్షివలె చాలా శోచనీయమైన అవస్థను పొంది వున్నది. పువ్వులతో శాఖాగ్రములు వంగిన అశోకవృక్షములు, మంచు తొలగిపోవుటచే స్పష్టముగా అనేక సహస్రకిరణములతో ప్రకాశించుచున్న చంద్రుడు భర్తవిరహముతో బాధపడుచున్న ఈమెకు అధికముగా శోకమును కలిగించుచున్నవి. 
 
బలవంతుడు, వానరశ్రేష్ఠుడు, వేగవంతుడూ అయిన హనుమంతుడు అక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి.. "ఈమె సీతయే'' అని నిశ్చయించుకుని, ఆ వృక్షమునే ఆశ్రయించి దానిపై కూర్చుండెను. సీతాదేవిని చూసిన సంతోషముతో హనుమంతుడు ఆనందాశ్రువులు రాల్చి, రాముని స్మరించి నమస్కరించెను. సీత కనబడుటచే ఆనందభరితుడైన పరాక్రమశాలైయైన ఆ హనుమంతుడు, రామునకు, లక్ష్మణునకు నమస్కరించి చెట్టు ఆకులలో అణగి ఉండెను.