శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (18:17 IST)

శ్రీరామ జననం: రామునికి తోడుగా వానరుల సృష్టి.. యుద్ధంలో వానరుల ఆయుధాలేంటి?

- దీవి రామాచార్యులు(రాంబాబు)

అయోధ్య పట్టణాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య కౌసల్య, రెండో భార్య సుమిత్ర, మూడో భార్య కైకేయి. కౌసల్య అయోధ్యకు పట్టపురాణి. కౌసల్యను వివాహమాడిన కొంతకాలానికి సంతానం కలుగలేదు. తనకు వారసుడు లేకుండా పోతాడేమోనని కైకేయిని వివాహమాడాడు. అయినను సంతానం కలుగలేదు.

చివరకు పండితులు, ఋషుల సలహా మేరకు పుత్రకామేష్ఠియాగం చేశాడు. యాగం చివరి రోజు హోమగుండము నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునికి పాయసం గిన్నె ఇచ్చి ముగ్గురు భార్యలకు పంచిపెట్టమని అదృశ్యమయ్యాడు. రాజు పాయసంలో సగం భాగం కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగం పాయసాన్ని సగ భాగం కైకేయికి, సగం భాగం సుమిత్రకు ఇచ్చాడు. పదకొండు నెలల తర్వాత ఒక పుణ్యకాలంలో కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు జన్మించారు. 
 
సాక్షాత్తు మహావిష్ణువు మానవుడిగా కౌసల్య గర్భంలో జన్మించాడు. ఇతనికి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు వశిష్టులవారు పంచాక్షరి మంత్రం ''నారాయణాయ'' నుంచి రెండవ అక్షరం ''రా'' అలాగే ''నమశ్శివాయ'' నుంచి రెండవ అక్షరం ''మ'' తీసుకుని ''రామ'' అని పేరు పెట్టారు. అంటే రాముడు శివ, విష్ణువుల కలయిక. అసలు నారాయణాయ నుంచి, నమశ్శివాయ నుంచి రెండవ అక్షరమే ఎందుకు తీసుకోవాలి.

నారాయణాయలో ''రా''లేకపోతే నాయణాయ అవుతుంది. అలాగే నమశ్శివాయలో రెండో అక్షరం లేకపోతే ''నశ్శివాయ''  అవుతుంది. అంటే శివుడు లేడు అని అర్థం. అందుకని ''రా'' ''మ" అనే ఈ  రెండు అక్షరాలు పంచాక్షరి మంత్రానికి మూలమైనవి. జాతకరీత్యా వారి గుణగణాలకు సరిపోయే పేరు పెట్టాలంటే పూర్వకాలంలో అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని పేరు పెట్టేవారు. దానికి అర్థం వుండేది. కాని ఇప్పటి దురదృష్టం పేరుకు మనిషికి పోలికలు వుండవు. 
 
రాముడు చైత్రమాసంలో నవమి తిథినాడు, పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. మరుసటి రోజు చైత్రమాసం దశమినాడు పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. అదేరోజున ఆశ్లేషా నక్షత్రమున, కర్కాటక లగ్నములో లక్ష్మణశత్రుఘ్నులు జన్మించారు. 
 
లోకకల్యాణం కోసం మహావిష్ణువు మానవరూపంలో జన్మిస్తున్నప్పుడు అతనికి సహాయంగా ఉండేందుకు బ్రహ్మదేవుడు వానరులను, ఇతరులను సృష్టించారు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము. దేవతలు వానర రూపములలో ఉన్న పుత్రులను సృజించిరి. మహావీర్యవంతులగు ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు, చారణులు కూడా వీరులైన కుమారులను వానరరూపములలో సృజించిరి. 
 
దేవేంద్రుడు, మహేంద్ర పర్వతము వంటి శరీరము కలవాడును, మహాబలవంతుడగు వాలియనెడు వానరేంద్రుని పుట్టించెను. తేజశ్శాలులలో గొప్పవాడైన సూర్యుడు సుగ్రీవుని పుట్టించెను. బృహస్పతి, వానరశ్రేష్ఠులందరిలోను మహాబుద్ధిమంతుడైన తారుడను గొప్పవానరుని సృజించెను. కుబేరుడు శ్రీమంతుడగు గంధమాధనుడనెడు కుమారుని సృజించెను. విశ్వకర్మ నలుడు అనెడు పేరు గల గొప్ప వానరుని సృజించెను. 
 
శ్రీమంతుడును, అగ్నితో సమానమైన తేజస్సు కలవాడును, అగ్ని కుమారుడును అగు నీలుడు తేజఃకీర్తి వీర్యములచే ఇతరుల వానరుల నందరిని మించి ఉండెను. సౌందర్యమనెడి సంపదగల అశ్వినిదేవతలు, ప్రశస్తసౌందర్యవంతులగు మైందుడు, ద్వివిధుడు అను వానరులను పుట్టించిరి. వరుణుడు సుషేణుడనెడు వానరశ్రేష్ఠుని, పర్జన్యుడు మహాబలశాలియగు శరభుని పుట్టించిరి.
 
వాయుదేవునకు శ్రీమంతుడును, వీర్యవంతుడును, వజ్రమువంటి దేహము కలవాడును, వేగమునందు గరుత్మంతునితో సమానుడును అగు హనుమంతుడు కుమారుడుగా జనించెను. అమేయమైన బలపరాక్రమములు గలవారును, కామరూపులును అగు వేలకొలది వీరులు దశగ్రీవుని వధ కొరకు సృష్టింపబడిరి. మేరు మంధర పర్వతములవలె మహోన్నతములైన దేహములు గల మహాబలవంతులగు ఋక్ష-వానరం-గోపుచ్ఛులు శీఘ్రముగనే జనించిరి. ఏ దేవునకు ఏ రూపము, ఏ వేషము, ఏ పరాక్రమము ఉండెనో ఆ దేవుని కుమారుడు కూడా అదే రూపము, అదే వేషము, అదే పరాక్రమము కలిగి వుండెను. 
 
కొనియాడదగిన పరాక్రమము గల కొందరు గోలాంగూల స్త్రీలయందును, కొందరు ఋక్షస్త్రీలయందును, కిన్నర స్త్రీలయందును జన్మించిరి. ఆ సమయమున దేవ-మహర్షి-తార్క్ష్య-యక్ష-కింపురుష-సిద్ధ-విద్యాధర-ఉరగులు అనేకులు చాలా సంతసించినవారై ప్రధానులైన అప్సరసలయందును, విద్యాధర - నాగ - గంధర్వస్త్రీల యందును, గొప్పదేహములు కలవారును, వనములలో సంచరించు వారును అగు వేలకొలది వానరులను సృజించిరి.
 
ఆ వానరులందరును కోరిన రూపము ధరింపగలరు. బలాఢ్యులు, స్వేచ్ఛగా సంచరించువారు. దర్పబలములచే సింహశార్దూలముతో సమానులు. వారికి అన్ని అస్త్రములను గూర్చియు తెలియును. (అయినను) వారు యుద్ధములలో శిలలు, వృక్షములు, గోళ్లు, కోరలు - వీటినే ఆయుధములుగా ఉపయోగించెడివారు.
- దీవి రామాచార్యులు(రాంబాబు)------ ఇంకావుంది(జానకి రామాయణం)