శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (15:46 IST)

కోపం వద్దు.. శాంతమే ముద్దు.. భక్తి మార్గంలో పయనించే వారికి..?

కోపం అనర్థాలకు దారితీస్తుంది. ఆపదలను కొని తెస్తుంది. అయితే శాంతం నిజానిజాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి శాంతం తోడ్పడుతుంది. అందుకే ఏ విషయంలోనూ తొందరపడొద్దని, శాంతియుతమైన జీవన విధానాన్ని అనుసరించడమే అన్ని విధాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
అజ్ఞానమే అహంకారానికి దారితీస్తుందనీ, ఎవరైతే కోపతాపాలను ప్రదర్శిస్తూ వుంటారో, అలాంటి వాళ్లకి అందరూ దూరమైపోతుంటారు. జీవితంలో వాళ్లు ఒక్కొక్కటిగా కోల్పోవడమే గానీ, కొత్తగా స్వీకరించేదంటూ ఏదీ వుండదు. అదే శాంతంగా వుంటే అంతా బంధువులుగా మారిపోతారు. అలాంటి శాంతం భక్తి మార్గంలో ప్రయాణించేవారికి ఒక వరంగా లభిస్తూ వుంటుంది.
 
ఎవరైతే శాంతియుతమైన వాతావరణాన్ని కోరుకుంటారో, అలాంటివారి జీవితం ప్రశాంతంగా సాగిపోతూ వుంటుంది. ఎక్కడైతే శాంతం వుంటుందో అక్కడ సంతోషం, సంతృప్తి వుంటాయి. 
 
శ్రీరామచంద్రుడు, గౌతమ బుద్ధుడు వంటి వారినే తీసుకుంటే, మూర్తీభవించిన శాంతానికి వాళ్లు ప్రతీకలుగా కనిపిస్తుంటారు. ఆవేశంతో వాళ్లు తొందరపడిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. అందుకే వాళ్లు లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.
 
కోపం తొందరపాటుని ప్రోత్సహించి అపజయాన్ని ఫలితంగ ఇస్తుంది. అదే శాంతంగా వుంటే  అవతలి వాళ్లు తమ తప్పు తెలుసుకుని అనుకూలంగా మారిపోతుంటారు. 
 
పురాణకాలం నుంచి కూడా ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఒకసారి వైకుంఠానికి వచ్చిన భ్రుగు మహర్షి .. తన రాకని గుర్తించలేదన్న కోపంతో శ్రీమహావిష్ణువు వక్షస్థలంపై కాలుతో తంతాడు.
 
కానీ జగాలనేలే జగన్నాథుడు ఎంతమాత్రం కోపించనూ లేదు. తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించడానికి ప్రయత్నించను లేదు. చిరునవ్వు చెదరకుండా వినయాన్ని వీడకుండా పరమ శాంతమూర్తిగా ఆ మహర్షి పాదాలనొత్తుతూ ఆయన అహంకారాన్ని అణచివేస్తాడు. 
 
శాంతమనే స్వభావం ద్వారా ఎదుటివారిని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చునో, శాంతమనే ఆయుధంతో ఎలాంటి విజయాలను సాధించవచ్చునో దీనిని బట్టి తెలుసుకోవచ్చు.