శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 జులై 2015 (16:28 IST)

పుష్కర కాలంలో శ్రాద్ధకర్మలు ఎందుకు చేస్తారు? ఏవేవి దానం చేయాలి?

పుష్కర కాలంలో శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పితృదేవతలను సంతృప్తిపరిచినట్లు అవుతుందని, తద్వారా పాపాలు తొలగిపోయి.. వంశాభివృద్ధి చేకూరినట్లవుతుందని పండితులు అంటున్నారు. సాధారణంగా పుష్కర కాలానికి మరో విశిష్టత ఏమిటంటే.. పితరుల సంస్మరణార్థం చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయాల్లో దేవతలు, రుషులు వారితో పాటు పితరులు కూడా వస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి.  
 
పుష్కరాల్లో పెట్టే శ్రాద్ధం పితరులకు తిండి పెడుతుందా? అని అందరూ అనుకోవచ్చు. కానీ మన కంటికి కనిపించని కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు పుష్కరాల్లోని మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవంలోని ఆహార రసాన్ని మన పితరులకు అందిస్తుందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసం చేస్తే సత్ఫలితాలను పొందవచ్చునని ఆగమ శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
 
శ్రాద్ధ కర్మలు ఎవరెవరికి ఇవ్వొచ్చంటే...?
పితృ, మాతృ వర్గాలకీ, మాతామహి మాతామహ వర్గాలకీ, అన్నదమ్ములతు, పినతండ్రి, పెదతండ్రులకు, అక్కచెల్లెళ్లకూ, బావమరుదులకు, బావగార్లకు, మామగారికి, అత్తగారికి, గురువులకు, శిష్యులకు, పినతల్లి, పెదతల్లులకు, మేనత్తలకు, వారి సంతానానికి, తన సంతానికి, అల్లుళ్లకూ కోడళ్లకూ ఇలా తనకు సంబంధించిన వారికందరికీ శ్రాద్ధకర్మ, పిండ ప్రదానం, తర్పణం వదలటం వంటి కార్యక్రమాలను జరపడం పుష్కర సమయంలో అనాదిగా వస్తున్న ఆచారం. 
 
పిండ ప్రదానంతో పాటు వస్త్రదానం, గోదానం, నువ్వుల దానం ఇవ్వొచ్చు. ఔషధదానం వల్ల ఆరోగ్యం, గోదానం వల్ల కైలాస ప్రాప్తి, నువ్వుల దానం వల్ల దుఃఖాలు తొలగిపోవడం, నేతిని దానం చేయడం వల్ల ఆయుర్దాయం, భూదానం వల్ల అధికారం, బంగారం, వెండి దానాల ద్వారా ఇహపర సౌఖ్యాలు పుణ్యలోక ప్రాప్తి చేకూరుతాయి. ఇవి ఇవ్వలేనివారు తమ శక్తికి తగిన ధనాన్ని దానం చేయవచ్చునని పండితులు అంటున్నారు.