శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 30 మే 2018 (21:48 IST)

దోచుకునేవారికి చివరికి మిగిలేదేమిటో తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోవాలి...

పూర్వకాలంలో ప్రజలు తమ నిత్యదైనందిన కార్యక్రమాల్లో గానీ, తమ జీవితాల్లో గానీ, తమ ఆరోగ్య విహారాదుల్లోగానీ ఎటువంటి అశాంతి లేకుండా హాయిగా కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికి ప్రజలలో అశాంతి ఎక్కువైపోయింది. దీనిక

పూర్వకాలంలో ప్రజలు తమ నిత్యదైనందిన కార్యక్రమాల్లో గానీ, తమ జీవితాల్లో గానీ, తమ ఆరోగ్య విహారాదుల్లోగానీ ఎటువంటి అశాంతి లేకుండా హాయిగా కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికి ప్రజలలో అశాంతి ఎక్కువైపోయింది. దీనికి కారణం... ఉన్నదానితో అసంతృప్తి. లేనిదాని కోసం తపన... ఇదే జీవితం. మానవునికి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలనే తపన. వాటిని సాధించడానికి జీవితమంతా పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఇలా ఉరుకులు పరుగులతోనే కాలం వృధా అవుతుంది. కాని పరుగు ఆపడం లేదు. పరుగు ఆపడమూ ఒక కళే. 
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
మానవునికి కోరిక వల్ల కోపం, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మరుపు, మరుపు వల్ల బుద్ధి నాశనం జరుగుతుంది. ఈ అశాంతికి కారణం సరియైన వివేకం లేకపోవడమే. ఈ కోరిక మెులకగా ఉన్నప్పుడే దానిని త్రుంచి వేయాలి. లేకపోతే అది పెరిగి పెద్దదై మహావృక్షమై మనస్సుని పాడుచేస్తుంది. దీనివలన జ్ఞాపకశక్తి కూడా నశిస్తుంది. కనుక మానవుడు తన మనస్సును కోరికల మీదకు పోనీయకుండా దృష్టిని దైవం మీదకు త్రిప్పినట్లయితే కోరిక నశించి మోక్షం కలుగుతుంది. ఈ అశాంతికి ఒక తార్కాణం ఏమిటో ఓ కథ ద్వారా తెలుసుకుందాం.
 
ఒక ఊరిలో పార్వతీశ్వర వర్మ అనే రాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ అశాంతికి గురి అవుతూ ఉండేవాడు. అతను తన అశాంతికి కారణం తెలుసుకోవాలని ఒకరోజు గ్రామంలో దండోరా వేయించి తన అశాంతికి కారణం తెలిపిన వారికి మూడు గ్రామాలతో పాటు ధనం ఇస్తానని ప్రకటించాడు. అది విని ఎందరో పండితులు, బహుభాషాకోవిదులు రాజుగారి కొలువుకి వచ్చారు. ఎన్నో నిర్వచనాలు చెప్పి, శాస్త్రాలన్నింటిని రాజు ముందు ఉంచారు. ఇవేవి రాజుగారిని తృప్తి పరచలేకపోయాయి. ఇంతలో సుదాముడు అనే ఒక యువకుడు వచ్చాడు. అతడిని చూసి ఆశ్చర్యపడుతూ మహారాజు ఇలా అన్నాడు. 
 
మీరేమో అల్పవయస్కులు, అనుభవం కూడా అంతంతమాత్రంగానే ఉండే పరువం.. అంత పెద్ద వృద్ధ పండిత శిఖామణులే తీర్చలేని మా అనుమానాన్ని మీరెలా నివృత్తి చేయగలరు అని ప్రశ్నించాడు. ఆ సుదాముడు అనే యువకుడు సన్యాసం పుచ్చుకొని దండకారణ్య అడవులలో పుష్కరకాలం పాటు తపస్సు చేసి, సత్యాన్ని గ్రహించి, అంబ కృప చేత జ్ఞాననేత్రాన్ని పొందాడు. అతడి గంభీర కంఠస్వరం విని కొలువుతీరిన జ్ఞాన సంపన్నులు, రాజ నీతిజ్ఞులు అందరూ ఆశ్చర్యపోయారు.
 
అప్పుడు మహారాజు మనిషిని అల్లాడిస్తున్న ఆశల మూలస్థానం ఏమిటని అడిగాడు. సుదాముడు ఇలా చెప్పాడు. కొన్ని సత్యాలు బాహ్యదృష్టికి కనిపించవు. అవి అంతర్దృష్టితో గోచరిస్తాయి. అటువంటి అంతర్దృష్టి కలగాలంటే అంతరాత్మను మేల్కొల్పాలి. ఆ కోణాన చూస్తే అశాంతి సుడిగుండానికి అత్యాశే మూలకారణం. అది అశాంతికి తోబుట్టువు. అన్యాయ, అక్రమాలకు కేంద్రబిందువు. అది మీలోనూ ఉంది. అందుకే మీకు అశాంతి కలుగుతుంది అని చెప్పాడు. అది విన్న మహారాజు కోపంతో ఊగిపోతూ నిరూపించమని అడుగగా సుదాముడు మీకిప్పుడు ఇద్దరు సతీమణులు. అందులో మెుదటి సతీమణేమో మధురానగర చక్రవర్తి కూతురు.
 
ఆయన కుమార్తెతో బాటు ఆమె తండ్రిగారి అర్థరాజ్యాన్ని పొందారు. రెండవ భార్య తండ్రేమో కోసలరాజ్య దేశాధిపతి. ఆయనకు ఒక్కగానొక్క కూతురు తప్ప మరెవరూ లేరనే కారణం చేత ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసి ఆయన రాజ్యాన్ని మీ రాజ్యంతో కలుపుకున్నారు. అంతటితో మీ ఆశల దాహం తీరక పొరుగూరి వజ్ర వ్యాపారి జ్యేష్ఠ పుత్రికను పెళ్లాడి ఆయన సర్వ సంపదనూ దోచుకున్నారు. దీని పేరే ఆశ. అని చెప్పగా మహారాజు సిగ్గుతో తలవంచుకున్నాడు. పశ్చాత్తాపం చెందిన రాజు సుదాముడికి ధనం బహుకరించాలని ఇవ్వబోగా సుదాముడు నవ్వుతూ... నేనుగానీ వీటిని స్వీకరించినట్లయితే మీకూ నాకూ వ్యత్యాసమేముంటుంది మహారాజా అంటూ రాజసభలో నుంచి వెళ్లిపోయాడు. కాబట్టి మనం కూడా ఆశ అనే దాన్ని ఆదిలోనే తుంచి మనకు ఉన్నదానితో తృప్తిగా జీవనం సాగించాలి. అప్పుడే అశాంతి మన దగ్గరకు రాదు.