శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : గురువారం, 16 జూన్ 2016 (14:36 IST)

తిరుమల ఎస్వీ మ్యూజియంలో వందల యేళ్ళ చరిత్ర కలిగిన అరుదైన నాణేలు

భక్తుల ఆర్థిక స్థాయిని సూచించే ఒక సూచిక ఆలయాల హుండీ ఆదాయం. తిరుమల శ్రీవారి ఆలయ హుండీని భక్తులు తమ కానుకలతో నింపుతూ ఉంటారు. ఆ విధంగా సమకూరుతున్న నగదు - నోట్ల రూపంలోను, నాణేల రూపంలో ఉంటుంది. ఆ నాణేలలో వ

భక్తుల ఆర్థిక స్థాయిని సూచించే ఒక సూచిక ఆలయాల హుండీ ఆదాయం. తిరుమల శ్రీవారి ఆలయ హుండీని భక్తులు తమ కానుకలతో నింపుతూ ఉంటారు. ఆ విధంగా సమకూరుతున్న నగదు - నోట్ల రూపంలోను, నాణేల రూపంలో ఉంటుంది. ఆ నాణేలలో విదేశీ నాణేలు, మనదేశానికి సంబంధించిన పురాతన నాణేలు ఉంటున్నాయి. నాణేల ముద్రణ గత 2,500 సంవత్సరాల నుంచి జరుగుతోంది. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలోని వివిధ రాజ్యాలతో రోమ్‌ సామ్రాజ్యం సాగించిన వర్తక ఫలితంగా భారతదేశంలో పలుచోట్ల రోమ్‌ సామ్రాజ్యం ముద్రించిన బంగారు నాణేలు లభిస్తున్నాయి. ఆ రోమ్‌ సామ్రాజ్య బంగారు నాణేలు శ్రీవారి హుండీ ద్వారా ఆలయానికి లభిస్తున్నాయి. 
 
భారత చరిత్రను ప్రతి ఫలించే విధంగా వివిధ కాలాలలో వివిధ సామ్రాజ్యాలకు చెందిన బంగారు, వెండి నాణేలు విరివిగా భక్తులు తిరుమల ఆలయానికి సమర్పించుకుంటున్నారు. పరకామణి అంటే హుండీ ఆదాయాన్ని లెక్కగట్టే పనిలో ఈ విధంగా లభిస్తున్న చారిత్రక ప్రాధాన్యం కల నాణేలు వేరు చేసి వాటిని శ్రీ వేంకటేశ్వర వస్త్రుప్రదర్శన శాలకు పంపడం జరుగుతోంది. 
 
తిరుమలలో ఉండే శ్రీ వేంకటేశ్వర వస్తుప్రదర్శన శాలలో వెయ్యికిపైగా ఉన్న బంగారు నాణేలు, మరో వెయ్యికి పైగా వెండి నాణెములను వర్గీకరించి ముఖ్యమైన నాణెములను సందర్శకుల కోసం మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. వీటిలో భద్రాచల శ్రీరాముడికి గుర్తుగా వేయించిన టంకా, విజయ నగర సామ్రాజ్య చక్రవర్తులు వేయించిన నాణేలు. బ్రిటీష్‌ కాలంలో ఈస్ట్ ఇండియా సంస్థ ముద్రించిన నాణెములు, ఇంకా ఎన్నో ఆశక్తి కర విధంగా నాణేలు ఉన్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని, సాంకేతికతను ఈ నాణేలు విశదీకరిస్తున్నాయి. శ్రీవారి ఆలయం మొదట్లో ఏ విధంగా ఉండేదో క్రమేణా ఏ విధంగా మారేదో, అలాగే తిరుమల ఘాట్‌ రోడ్లు ఇలా ఒకటికాదు ఏడు కొండల గురించి వివరించే అన్నీ ఈ మ్యూజియంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 
 
బ్రిటిష్‌, ఇస్లాం పాలకులు ముద్రించిన నాణెములు కూడా శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో విరివిగా లభిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ఇవేకాక కాగితపు కరెన్సీ విభాగంలో వివిధ దేశాల నోట్లు, భారతదేశానికే చెందిన పాతకాలపు కాగితపు కరెన్సీ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని కూడా వర్గీకరించి ప్రదర్శనశాలలో సందర్శకుల కోసం ఏర్పాటు చేయడానికి మ్యూజియం సిబ్బంది ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఇన్నేళ్ళ చరిత్ర కలిగిన మ్యూజియం దక్షిణ ఆసియాలోనే లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎంతో భద్రంగా తితిదే ఈ మ్యూజియంను కాపాడుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో మరింత అరుదైన నాణేలు కూడా లభించినట్లు సమాచారం. అయితే ఆ నాణేలను భద్రపరిచేందుకు మ్యూజియంలో స్థలం లేకపోవడంతో ప్రస్తుతానికి వాటిని బయటే ఉంచారు. తితిదే ఈఓ సాంబశివరావు ఎప్పటికప్పుడు మ్యూజియంను పర్యవేక్షిస్తూ అరుదైన నాణేలను కాపాడే బాధ్యతలను తీసుకున్నారు.
 
తిరుమలకు వచ్చే భక్తుల్లో 50 శాతంకుపైగా వారు మ్యూజియంను సందర్శిస్తున్నారు. అరుదైన నాణేలను చూసి ఆశ్చర్యచికితులవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తితిదే మ్యూజియంలోకి భక్తులను అనుమతిస్తోంది. ఈ సమయాన్ని పెంచాలన్న ఆలోచనలో ఈఓ ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళల్లో కూడా మ్యూజియంను కొనసాగిస్తే మరింత మంది భక్తులు సందర్శించే అవకాశం ఉందని ఈఓ భావిస్తున్నారు.