Widgets Magazine

అలాంటి వారికి క్రూర మృగాలు కూడా సలాం కొడతాయి: స్వామి వివేకానంద

కారణమే కార్య మవుతుంది. కారణంవేరు, దాని ఫలితంగా జరిగే కార్యంవేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. ఇలా మన మనస్సుకు ప్రతిది వేరుగా కనిపిస్తుంటాయి. విశ్వం నిజంగా ఏకజాతీయమైనది. వైవిధ్య స్థూలదృష్టికి కనిపించేది మాత్రమే.

swamy vivekananda
chj| Last Modified బుధవారం, 31 జనవరి 2018 (21:24 IST)
కారణమే కార్య మవుతుంది. కారణంవేరు, దాని ఫలితంగా జరిగే కార్యంవేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. ఇలా మన మనస్సుకు ప్రతిది వేరుగా కనిపిస్తుంటాయి. విశ్వం నిజంగా ఏకజాతీయమైనది. వైవిధ్య స్థూలదృష్టికి కనిపించేది మాత్రమే. ప్రకృతిలో అంతటా, విభిన్న పదార్థాలు - విభిన్న శక్తులు మొదలైనవి ఉన్నట్లు కనిపిస్తాయి. రెండు వేరువేరు వస్తువులను తీసుకుందాము. గాజు ముక్కను, చెక్కమక్కను తీసుకోండి. రెంటిని పొడి చేయండి. ఇక పొడి చేయడానికి సాధ్యం కానంత పొడిచేయండి. అప్పుడు ఆ పదార్థం ఏకజాతీయంగా కనిపిస్తుంది. పదార్థాలన్నీ తమ అంతిమ దశలో ఏకజాతీయమైనవే.
ఏక జాతీయతే అసలు సత్యం,సారం. వివిద పదార్థాలుగా కనిపించే దృశ్యం వైవిధ్యం. ఏకం అనేకంగా కనిపించడం వైవిధ్యం. వినుట,కనుట రుచి చూచుట ఇవన్నీ ఒకే మనస్సు వివిధావస్థలు. గదిలోని వాతావరణాన్ని మనోశక్తివల్ల మార్పుచేసి, గదిలో ప్రవేశించే ప్రతివ్యక్తి వివిధ వైచిత్రాలను చూచేలా భ్రాంతి కలగవచ్చు. ప్రతి మనిషి ఇది వరకే భ్రాంతిని తగుల్కొని వున్నాడు. ఈ భ్రాంతిని తొలగించుటే సాధన స్వరూప సాక్షాత్కర ప్రాప్తి అవుతుంది.
మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కొత్తగా ఏ శక్తులను పొందపోవటంలేదు. ఇదివరకే శక్తులన్నీ ఉన్నాయి. భ్రాంతిని తొలిగించుకోవటంలోనే పొందవలసిన వికాసం క్రమమంతా ఉంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధి అతి ముఖ్యం. మానసిక శక్తులను పొందటమే ప్రధానంగా ఎంచవద్దు. వాటని త్యాగం చేయాలి. మానసిక శక్తులను కోరేవాడు, వాటికి వశమైపోతాడు. సిద్దులను కోరేవారంతా దాదాపుగా వాటిలోనే చిక్కుకొని భ్రష్టులవుతారు. మనుస్సును సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవటానికి నిర్దుష్ట నైతికనిష్ఠ అత్యవవసరం. ఇది కలవాడు చేయవలసిందిక ఏమీ ఉండదు. అతను ముక్తుడే.

నైతిక పరిపూర్ణత్వన్నిపొందినవాడు, ఏ జీవికి హాని చేయలేడు, దేనిని బాధించలేడు. ముక్తుడు కావాలనుకునేవాడు అహింసలో ఉత్తీర్ణుడు అయితీరాలి. ఇలా అయినవానికన్నా శక్తిమంతుడు ఎవడూ లేడు. అతని సమక్షంలో ఎవరు పోరాడలేరు, కలహింపలేరు, అతని సాన్నిధ్యం శాంతిప్రదం, ప్రేమదాయకం, అతని సమక్షంలో ఎవ్వరూ ఆగ్రహింపలేరు. పశువులు, క్రూరమృగాలు కూడా అతని ఎదుట సాధువుగానే ఉంటాయి. ఇతరులు ఎంత దుష్టులైనాసరే, వారి దోషాల గూర్చి ఎప్పుడూ మాట్లాడవద్దు. అలా మాట్లాడితే ఏనాడు మేలు జరగదు. ఇతరుల తప్పులు ఎంచటం వల్ల నువ్వు చేయగల సహాయం ఏమిలేదు.
- స్వామి వివేకానంద


దీనిపై మరింత చదవండి :