శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (18:28 IST)

ద్రాక్షారసం నల్లబడిపోయింది-అమృతం స్వర్గానికి పారిపోయింది!

లోకంలో సాద్విష్ట పదార్థాలు కొన్ని ఉన్నాయి. ద్రాక్షరసం చాలా తీపిగా ఉంటుంది. కలకండ కూడా అట్లే చాలా మధురంగా ఉంటుంది. ఇక అమృతం మాట చెప్పాల్సిన అవసరం లేదు. 
 
ఈ మూడున్ను మధుర  పదార్థాలలో లెక్కింపదగినవి. అయినప్పటికీ వీటికంటే మహా మధురమైనది సుభాషిత రసం. కనుకే సుభాషితరసం ధాటికి తట్టుకోలేక ద్రాక్షారసం నల్లబడిపోయినదని, అమృతం స్వర్గానికి పారిపోయిందని కవి పుంగవుడు చమత్కరించాడు. 
 
మహనీయుల ముఖతః వెలువడు సుభాషితములు జీవితాన్ని  సంస్కరింపజేస్తాయి. అజ్ఞానిని జ్ఞానవంతునిగా మార్చేస్తాయి. 
 
సంసార బంధమున తగులుకొని నానాయాతనలను అనుభవించే వారిని బంధ విముక్తులుగా చేసి పరమానందం ప్రసాదించేవి సుభాషితాలే వెయ్యేల బద్ధుని ముక్తునిగచేస్తాయి. ఏడ్చుచున్నవారి కన్నీరు తుడిచి ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. కనుకనే ఈ సుభాషిత రసం రసముల్లోకెల్లా సర్వోత్కృష్టమైనదని చెప్పియున్నారు. 
 
మహాత్ముల అనుభవ పూర్వకములైన ప్రబోధాలను చక్కగా శ్రవణం చేసి వారి బోధామృతాన్ని తనవితీర గ్రోలి నిత్య జీవితంలో వాటిని కార్యాన్విత మొనర్చుకొని పరమశాంతిని అనుభవించాలి. 
 
అంధకార బంధురమైన ఈ ప్రపంచములో పెద్దల బోధనలే జీవునకు శరణ్యం. కావున ప్రయత్నపూర్వకంగా మహాత్ముల సన్నిధిని చేరి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి గురుబోధన చేయించుకోవాలి. వాటిని ఆచరించడం ద్వారా కృతార్థులు కావాలి.