శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (17:32 IST)

సీత లక్ష్మణుని నిందించుట : లక్ష్మణుడి విషయంలో ఎందుకు సందేహించింది?

రామాయణములో ఈ సన్నివేశము, భక్తితో మనస్సుపెట్టి చదివేవారికి మనస్సును బాగా కష్టపెట్టే సన్నివేశము. ఎందుకని అంటే తల్లితో సమానంగా చూసుకునే లక్ష్మణునిపై సీత తన హద్దులు దాటి నిందవేస్తుంది. సీతయొక్క మనోభావాలు ఒక సాధారణ స్త్రీవలె ఎలా కలిగి వున్నదో తెలియజేసే సన్నివేశము. సీత, లక్ష్మణునితో ఇలా అంటుంది. 
 
వెళ్ళి రామునికి ఏమైనదో తెలిసికొనుము. బిగ్గరగా అరచుచున్న రాముని గొంతు విని నా హృదయముకాని, ప్రాణములు కాని నిలుచుటలేదు. వెళ్ళి నీ సోదరుని రక్షింపుము అని చెప్పినను నువ్వు పట్టించుకొనుట లేదు. నువ్వు రామునికి, పైకి మిత్రుడివలె కనబడే శత్రువు.
 
నీకు నాపై ఆసక్తి ఉండుట చేత, రాముడు నశించవలెనని కోరుకొనుచున్నావు. నా మీద ఉన్న ఆశలవలననే నువ్వు రాముని వద్దకు వెళ్ళుట లేదు. రామునికి కష్టము కలుగవలెనని నీవు కోరుకొను చున్నావు. నీకు అన్నపైన ప్రేమలేదు. ఏ రాముని కొరకు నువ్వు అడవులకు వచ్చావో, ఆ రామునకు ప్రాణాపాయము కలిగిన పిమ్మట ఇక్కడున్న నాతో నీకు ప్రయోజనమేమి, నన్ను రక్షించటం కన్నా రాముని రక్షించుట నీ యొక్క ప్రధాన కర్తవ్యము (111 45, 1-9) సీత కన్నీళ్ళు కార్చుచూ, దుఃఖముతో ఎంత చెప్పినను, లక్ష్మణుడు రామునిపై నమ్మకముతో అతని బలపరాక్రమములు తెలిసినవాడై స్థిరముగా నుండెను. సీతకు రామునిపై నమ్మకములు కలిగించుటకై ఎన్నో విధములుగా రాముని యొక్క గొప్పతనమును వివరించెను. 
 
సీత లక్ష్మణుని మాటలు విని చాలా కోపంగా ఎర్రని కళ్ళతో, సత్యము పలికిన లక్ష్మణునితో పరుషమైన వాక్యములు పలికెను. కులమున చెడపుట్టిన ఓ క్రూరుడా! చేయకూడని పనిచేయుటకు ప్రారంభించుచున్నావు. రామునకు పెద్ద కష్టము రావలెనని నీవు కోరుకొనుచున్నావని నా అభిప్రాయము. దుష్టబుద్దివైన నీవు ఒంటరిగా నీ భావము పైకి ఏమీ తెలియనీయక, నా కొరకు, లేదా భరతుని ప్రేరణ చేత, అరణ్యములో ఒంటరిగా ఉన్న రాముణ్ణి అనుసరించి వచ్చుచున్నావు. రాముణ్ణి భర్తగా ఆశ్రయించిన నేను ఇతర జనుణ్ణి ఎట్లు కోరుదును. నీ ఎదుట నేను ప్రాణాలు విడిచెదను. సందేహము లేదు. రాముడు లేకుండా ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా జీవించను'' (11 45, 21-16) విశాల నేత్రయైన సీత అలా దుఃఖించుచు ఏడ్చుచుండగా చూసి, లక్ష్మణుడు చాలా దుఃఖితుడై సీతను ఓదార్చెను. కానీ సీత తన భర్త సోదరుడైన లక్ష్మణునికి ఎటువంటి బదులు చెప్పలేదు. ఆ తర్వాత లక్ష్మణుడు సీతకు నమస్కారము చేసి మాటి మాటికి వెనుకకు తిరిగి సీతనే చూస్తూ రాముని దగ్గరకు వెళ్ళెను. 
 
లక్ష్మణుని గుణగణాలు సీతకు బాగా తెలిసినను, తన భర్త ఆపదలో వున్నాడేమో అనుకున్న మరుక్షణము, ధర్మాధర్మముల విచక్షణా జ్ఞానమును కోల్పోయి ఏం మాట్లాడాలి. ఏమి మాట్లాడకూడదు... అని కూడా విచారించకుండా లక్ష్మణుని నిందించింది. అది కూడా కఠినమైన మాటలతో అతని మనస్సును గాయపరిచినది. నిజంగా సీత అంత పిరికిదా? ధైర్యం లేనిదా! ఆత్మస్థైర్యం లేనిదా? లేదా లక్ష్మణునిపై నిజంగా అవమానం కలిగినదై వున్నదా అని విచారిస్తే రావణుని చెరసాలలో సీత రాముని కొరకు వేచి వున్నది. ఒత సంవత్సర కాలము రాముడిపై నమ్మకముతో ఎలాగైనా తనను కాపాడి తీసుకొని పోతాడని ఓర్పుతో వున్నది. రాముడి పరాక్రమములు పైన సీతకు అపారమైన నమ్మకము వున్నది. 
 
హనుమంతుడు సీతను రాముడి వద్దకు తీసుకుని వెళ్తానని ఎంత బ్రతిమాలినను సీత అందుకు సమ్మతించక, నా రాముడు వస్తాడు. నన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పిన సీత మరి లక్ష్మణుడి విషయంలో ఎందుకు సందేహించింది. ఒక వేళ లక్ష్మణున్ని అంత కఠినంగా నిందించకపోతే తన రక్షణాబాధ్యతను వదిలి రాముడి కొరకు లక్ష్మణుడు పోడని సీత అలా ప్రవర్తించి వుండవచ్చును. తన ఆలోచనా విధానము ఎలా వున్ననూ, బుద్ధిమంతుడు, ధైర్యశాలి, సోదరప్రేమ కలిగినవాడు, ధర్మము ఎరిగినవాడు. అన్నింటికన్నను సీతను తల్లికి సమముగా చూసుకునే వాడైన లక్ష్మణుని బహిర్గతముగా ఎన్నో పరుషమైన వాక్యములు పలికినందుకు సీత ఆ తర్వాత ఎంతో పశ్చాత్తాపము చెందింది.