శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2016 (18:19 IST)

సీత రావణునికి నీతిని బోధించుట: నీ మనస్సును నామీదనుంచి మరల్చి నీ భార్యల్ని ప్రేమించుము!

భయంకరుడైన రావణుని మాటలు విని, సీత దుఃఖించుచు, దీనమైన స్వరముతో, మెల్లగా ఇట్లు పలికెను. మహాపతివ్రతయైన ఆ సీత, దుఃఖపీడితురాలై, దయనీయమైన స్థితిలో ఏడ్చుచు, భర్తనే తలచుచు, ప్రత్యక్షముగా రావణునితో మాటలాడుటకు ఇష్టము లేకపోవుటచే మధ్య  ఒక గడ్డిపరకను అడ్డముగా ఉంచి, వణికిపోవుచు ఇట్లు పలికెను:
 
''నీ మనస్సును నామీదనుంచి మరల్చి నీ భార్యలపై నిలుపుము. నీ భార్యలను ప్రేమించుము. పాపములే చేసినవాడు ఉత్తమమైన సిద్ధిని ఎలా ఆశించకూడదో, అట్లే నీవు నన్ను ఆశించకూడదు. నేను ఉత్తమ వంశములో పుట్టి, ఉత్తమమైన వంశములోనికి కోడలుగా వెళ్ళినదానిని. పతివ్రతను, నింద్యమైన ఇట్టి అకార్యమును నేను చేయజాలను. 
 
పర భార్యను, పతివ్రతను అయిన నేను నీకు తగిన భార్యను కాను, ధర్మమును బాగుగా చూడుము. సత్పురుషులనుసరించు నియమములను చక్కగా పాటించుము. ఓ రాక్షసుడా! నీ భార్యలు ఎట్లు రక్షింపదిగినవారో ఇతరుల భార్యలు కూడా అట్లే రక్షింపదగినవారు. అందుచేత నిన్నే ఉపమానము చేసి చూసుకుని, నీ భార్యలను అభిలషించినచో వారి కుండునను విషయము గ్రహించి, నీ భార్యలతో నీవు సుఖించుము. చపలస్వభావుడై, తన భార్యలతో సంతృప్తిచెందక, ఇంద్రియ నిగ్రహము లేకుండా ఉన్న నీచబుద్ధి కలవానిని, పరభార్యలు పరాభవమును పొందింతురు. (అనగా పరదారాసక్తి వాని పతనమునకు హేతువగును). 
 
నీ బుద్ధి సత్ప్రవర్తన లేక విపరీతముగా ప్రసరించుచున్నది ఈ దేశములో నీకు సద్బుద్ధి బోధించే మంచివారే లేరా? ఉన్నా వారి మాటను నీవు వినుటలేదా? ధర్మమార్గము తెలిసిన సత్పురుషులు నీకు హితము ఉపదేశించినా అధర్మమార్గమునందు ప్రవర్తించుచున్న చిత్తము గల నీవు, రాక్షసుల వినాశమును దాపురించుటచే ఆ ఉపదేశమును లెక్కచేయుట లేదా!
 
మనస్సు అదుపులో లేక అపమార్గమునందు ప్రవర్తించు రాజు పరిపాలనలో ఐశ్వర్య సంపన్నములైన రాష్ట్రములు, నగరములూ కూడా నశించును. అటువంటి నీవు రాజుగా దొరుకుటచే సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంక నీ ఒక్కని మూలమున, కొద్ది కాలములో నశించగలదు. దీర్ఘదృష్టిలేని పాపాత్ముడు, తాను చేసిన పనులే తనను దెబ్బతీయగా నశించి పోవును. అపుడు వానిని చూసి సకలప్రాణులు సంతోషిస్తాయి. పాపకర్మలు చేయుచున్న నీవు కూడా ఇట్లే నశించగలవు. అప్పుడు నీచే పీడింపబడిన వారందరూ సంతోషించుచు, మా అదృష్టముకొలది ఈ క్రూరునికి ఇట్టి ఆపద వచ్చినది అనుకొనెదరు. 
 
ఐశ్వర్యమునూ, ధనమునూ చూపించు నన్నెవరూ లోభపెట్టజాలరు. కాంతి సూర్యుని నుండి ఏ విధముగా వేరు కాదో ఆ విధముగా నేను రాముని భుజమును తలగడగా ఉపయోగించుకొని సుఖముగా నిద్రించిన నేను, ఎవ్వడో మరొక్కని భుజమును తలగడగా ఎట్టు స్వీకరించగలను! వేదాధ్యయనము చేయుటకు అవలంబించిన వ్రతమును పూర్తిచేసుకున్న బ్రాహ్మణునకు ఆ వేదవిద్య ఏవిధముగా తగియుండునో అట్లే నేను సమస్తమైన భూమికి ప్రభువైన ఆ రామునకు మాత్రమే భార్యనగుటకు తగిన దానను. 
 
అరణ్యములో ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు, దుఃఖితురాలినైన నన్ను రామునితో చేర్చుము. అది యుక్తము. నీవు నీ రాజ్యమునకు ప్రభువుగా ఉండవలెనన్నచో, ఘోరమైన మరణమును పొందకుండా జీవించవలె నన్నచో పురుషశ్రేష్ఠుడైన ఆ రామునితో స్నేహము చేసికొనుట మంచిది. ధర్మములన్నీ తెలిసిన ఆ రాముడు శరణాగతవత్సలుడను విషయము లోకప్రసిద్ధము. నీకు జీవించవలెనను కోరిక ఉన్నచో ఆ రామునితో స్నేహము చేసికొనుము. 
 
శరణాగతవత్సలుడైన ఈ రాముని అనుగ్రహింపచేసుకొనుము. నన్ను యథావిధిగా మరల రామునకు సమర్పించుము. ఈ విధముగా నన్ను రామునకు తిరిగి ఇచ్చివేసినచో నీకు క్షేమము కలుగును. నీవు మరొక విధముగా చేసినచో నీకు మరణము తప్పదు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రమైనను నీవంటివానిని ఏమి చేయలేక విడిచి పెట్టవచ్చును. యముడు కూడా చాలా కాలముపాటు విడిచిపెట్ట వచ్చును. కోపము వచ్చినచో, ఆ లోకనాథుడైన రాముడు మాత్రము విడిచిపెట్టడు. 
 
నీవు అచిరకాలములో, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము ధ్వనివంటి దిక్కులను పిక్కటిల చేయు రామధనుర్థ్వనిని వినగలవు. గట్టి కణుపులతో, మండుచున్న ముఖములు గల సర్పములవలె భయంకరములై, రామలక్ష్మణుల పేర్లతో చిహ్నితములైన బాణములు శీఘ్రకాలములో ఈ లంకానగరమునందు పడగలవు. రామలక్ష్మణుల బాణములు, ఈ నగరములో అంతటా, రాక్షసులను చంపుచు, ఈ నగరము నంతను కప్పివేయగలవు. 
 
గరుత్మంతుడు సర్పాలను పెకిలించి వేసినట్లు రాముడనే ఆ గొప్ప బలశాలియైన గరుత్మంతుడు రాక్షసులనే సర్పాలను పెకిలించి వేయగలడు. విష్ణువు మూడు అడుగులు వేసి, ప్రకాశించుచున్న లక్ష్మిని అసురుల నుండి తీసికొనిపోయినట్లు నా భర్తయైన రాముడు, శీఘ్రముగా నన్ను నీ వద్దనుండి తీసికొని పోగలడు. 
 
రాముడు రాక్షస సైన్యమును చంపివేయుటచేత, జనస్థానము హతస్థానము (చచ్చినవాళ్ళ స్థానము) అయినది. అప్పుడు నీవేమీ చేయజాలక ఈ చెడ్డ పని చేసితివి (నన్ను అపహరించితివి). ఓరీ! నీచుడా! నరులలో శ్రేష్ఠుడైన ఆ రామలక్ష్మణులిద్దరూ బైటకు పోయినప్పుడు వారు లేని ఆశ్రమములో ప్రవేశించి, నీవు నన్ను అపహరించినావు. 
 
పెద్దపులుల గంధమును వాసన చూసిన కుక్కవాటి ఎదుట ఎట్లు నిలవజాలదో, అట్లే రామలక్ష్మణుల గంధము వాసన చూచిన పిమ్మట నీవు వారి ఎదుట నిలువజాలవు కదా!. రెండు బాహువులతో  పోరాడిన ఇంద్రునియందు ఒక్క బాహువుతో పోరాడిన వృత్తాసురుడు నిలువజాలనట్లు వారిద్దరితో యుద్ధముతో నీవు నిలువజాలవు. అచిరకాలములో నా భర్తయైన రాముడు లక్ష్మణునితో కలిసి వచ్చి, చాలా తక్కువగా ఉన్న జలమును సూర్యుడు ఎండింపజేసినట్లు, బాణములతో నీ ప్రాణములను తీసివేయగలడు. 
 
నీవు నశించు కాలము సమీపించినది. మహావృక్షము తనపై పడుచున్న పిడుగును ఏవిధముగా తప్పించుకొనజాలదో, అట్లే నీవు, కైలాసపర్వతమునకు పారిపోయినను, కుబేరుని అలకాపురికి వెళ్ళినను, రాజైన వరుణుని సభకు పారిపోయినను రాముని నుండి తప్పించుకొనజాలవు. - దీవి రామాచార్యులు (రాంబాబు)