శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2016 (20:13 IST)

తిరుమలలో ఏకాంత ఆరగింపు... యేడాదికి రూ.36 లక్షలు స్వాహా...?

ఈ నెల 4తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం వైభవంగా జరిగింది. ఈ సంధర్భంగా అమ్మవారికి జీడిపప్పులు, బాదంపప్పులు తదితర డ్రైఫూట్స్‌తో అందమైన మాలలు తయారుచేసి అలంకరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్నపన తిరుమంజనంలోనూ స్వామివార

ఈ నెల 4 తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం వైభవంగా జరిగింది. ఈ సంధర్భంగా అమ్మవారికి జీడిపప్పులు, బాదంపప్పులు తదితర డ్రైఫూట్స్‌తో అందమైన మాలలు తయారుచేసి అలంకరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్నపన తిరుమంజనంలోనూ స్వామివారికి ఇలాంటి మాలలు అలంకరించారు. ఈ ఉత్సవాలను టీవీల్లో చూసిన జనం విశేషంగా డ్రైఫూట్ మాలల గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. తిరుచానూరు అమ్మవారి పంచమీతీర్థానికి హాజరైన తిరుపతి అదనపు సీనియర్‌ జడ్జి సదానందమూర్తి కూడా ఈ మాలలు ఆకట్టుకున్నాయి.

పూజ అనంతరం మాలల్లోని డ్రై ఫూట్స్‌ను ఆలయ అధికారులు పంచుకుని తీసుకెళతారని అక్కడి జనం చర్చించుకోవడం తాను గమనించానని చెబుతూ అసలు దేవుని కోసం వాడిన మాలల్లోని పండ్లను ఏమీ చేస్తారో వివరాలు ఇవ్వాలంటూ తితిదే ఈఓ సాంబశివరావుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తన లేఖను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చినదిగా భావించి సమాచారం ఇవ్వాలని ఆ లేఖలో కోరినట్లు తెలుస్తోంది.
 
రోజూ రాత్రి ఆలయం మూసే ముందు స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. స్వామికి జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, పండ్లు, పాలు, నైవేథ్యంగా సమర్పించి స్వామిని పవళింపజేసి నిద్రపుచ్చి వెళతారు. ప్రతి దేవాలయంలోను ఏకాంతసేవ ఉంటుంది. దిట్టం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ కోసం 400 గ్రాముల డ్రైఫూట్స్ వినియోగించాలి. ఆలయంలో ప్రతిపూజకూ దిట్టం అనేది ఉంటుంది. అయితే శ్రీవారి ఆలయంలో మాత్రం దాదాపు 15 కిలోల బస్తాకు డ్రై ఫూట్స్ తీసుకొస్తారు. ముంతమామిడి పప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష దోరగా వేయించి ఒక బస్తాలో పోసుకుని తీసుకొస్తారు. దేవుని ముందు పెట్టే 400 గ్రాముల డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న దోనెల్లో కొద్దికొద్దిగా వేసి ఏకాంతసేవలో పాల్గొనే భక్తులకు అందజేస్తారు. స్వామి వద్ద పెట్టిన పాలను తీర్థంలా అందజేస్తారు. భక్తులకు దక్కేది ఈ 400 గ్రాముల ప్రసాదం మాత్రమే. భక్తులు బయట వెళ్ళిన వెంటనే అధికారులు, ఉద్యోగులు, అయ్యోర్ల పంపకాలు మొదలవుతాయి.
 
 
బస్తాల్లో తెచ్చిన పప్పులు, ద్రాక్షను పాలిథిన్‌ కవర్లలో నింపుతారు. ఒక్కో కవర్లలో కనీసం 400 గ్రాములుంటుంది. ముందుగా డ్యూటీ ఆఫీసర్‌ ఎవరుంటే వాళ్లకు ఒక కవర్‌ ఇస్తారట. ఆపై టెంపుల్‌ ఏఈఓ, పడికావలి ఏఈఓ, వైకుంఠం-1, ఎవిఎస్‌ఓ విఐ, హుండీ సెక్యూరిటీ, సన్నిధి సెక్యూరిటీ పడికావలి ఇన్స్‌పెక్టర్‌, సన్నిధి దఫేదార్‌, సన్నిధి అటెండర్‌, కైకాల్‌ రెడ్డి, ఎలక్ట్రికల్‌ ఇలా మొత్తం 18 కవర్లు పంపిణీ జరుగుతాయట. ఆపై డ్యూటీలో ఉండే జియ్యంగార్‌ గుమస్తాలు, సబేరా స్వాములు, అర్చకులు వాళ్లో పది మందికిపైగా ఉంటారు. వాళ్ళు తలా కవర్‌ తీసుకెళుతారట. బోర్డు సభ్యులు ఎవరైనా ఏకాంత సేవకు వస్తే వారికి ఒక కవరు ఇస్తారు. వారితో పాటు వచ్చిన వారికి ప్రత్యేకంగా కవరు అందజేస్తారు. ఇలా మొత్తం 30-35 కవర్లలో డ్రైఫూట్స్ పంపిణీ జరుగుతుందట. 
 
 
ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు 10 వేలు, నెలకు 3 లక్షలు, యేడాదికి 36 లక్షలు ఈ జీడిపప్పుల రూపంలో ఆరగింపు అవుతోంది. ఈ యేడాది జూన్‌లో జీడిపప్పు కొనుగోలు కోసం తితిదే టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో కిలో 668.79 ధర పలికింది. అప్పటి నుంచి అదే ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన వేసుకుంటే యేడాదికి 36 లక్షలు స్వామి సంపదను ప్రసాదం రూపంలో స్వాహా చేస్తున్నారన్నమాట. ఇది అనధికారిక వ్యవహారమే అయినప్పటికీ అధికార వ్యవహారంలా సాగిపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైందో కానీ అదలా సాగిపోతోంది. ఎందరు అధికారులు మారినా ఎవరూ దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
 
ఆలయ దిట్టంలో ఎంత పరిమాణం నిర్ధేశించి ఉంటే అంతే పరిమాణంలో సరుకులు ఉగ్రాణం అధికారులు ఇస్తారు. ఏకాంత సేవకు 400 గ్రాములు దిట్టమని చెబుతున్నారు. మరి 15 కిలోల డ్రైఫూట్స్ ఆలయంలో రోజూ ఎలా పంపిణీ జరుగుతోంది. వీటిని ఏ లెక్కల్లో రాస్తున్నారు. ఏమో ఎవరికీ తెలియదు. ఏకాంత సేవ పేరుతో కవర్లకొద్దీ డ్రై ఫూట్స్ తీసుకెళుతున్నారు. ఈ తతంగాన్ని గమనించిన ఆలయ అధికారి ఒకరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇక్కడ జరిగే తంతుపై ఒక ఫైలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారట. ఆయన అందులో ప్రధానంగా ఈ విషయాలన్నీ ప్రస్తావన చేశారు. ప్రతిదానికీ లెక్క ఉండాల్సిన చోట రోజూ 10 వేలకు లెక్కలేకపోవడం ఏమిటి. ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఈఓ సాంబశివరావు స్వయంగా కల్పించుకుంటే తప్ప ఈ ఆరగింపునకు అడ్డుకట్ట పడే సూచనలు కనిపించడం లేదంటున్నారు భక్తులు.