శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (14:00 IST)

నేను క్రిస్టియన్ కాదు.. హిందువుని... నన్ను కొనసాగించండి... ఎవరు?

ఏది ధర్మం.. ఏది అధర్మం. అన్ని కులాలు, అన్ని మతాలు ఒక్కటే. సమస్త జీవకోటిని చల్లంగా చూసే దేవుడొక్కడే. ఇలాంటి నానుడికి రాను రాను ఆదరణ కరువైపోతోంది.

ఏది ధర్మం.. ఏది అధర్మం. అన్ని కులాలు, అన్ని మతాలు ఒక్కటే. సమస్త జీవకోటిని చల్లంగా చూసే దేవుడొక్కడే. ఇలాంటి నానుడికి రాను రాను ఆదరణ కరువైపోతోంది. కులం పేరుతో మతం పేరుతో చివరకు దేవుళ్ళను కూడా వేరు చేసి చూస్తూ మనుషుల మధ్య విద్వేషాలను పెంచుతున్నారు. 
 
అలాంటి పరిస్థితి ఇప్పుడు తిరుపతిలో నెలకొంది. ఆధ్మాత్మిక సంస్థ టిటిడిలో అన్యమత ప్రచారంపై ఎప్పటి నుంచో రగడ జరుగుతోంది. దీని నివారణకు తీసుకుంటున్న చర్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తితిదేలో హిందూయేతరులకు స్థానం లేదా.. వేరే మతస్తులు టిటిడిలో ఉంటే హిందూ ధర్మం దెబ్బతింటుందా?
 
తిరుమలలో మత ప్రబోధకులు ఎక్కువై పోయారు. మంచిని ప్రబోధించడం మరిచిపోయి ఎవరి మతాన్ని వారు ప్రమోట్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. అందరు దేవుళ్ళు.. అన్ని మత గ్రంథాలు చెప్పేది ఒకటే అయినప్పటికీ వాటిని చిలువలు పలువలు చేస్తూ జనాల మధ్యలో ఒకరిపై ఒకరికి విద్వేషాలను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. మతంతో దేవుడిని ముడిపెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. 
 
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారంపై గతంలో అనేక వివాదాలు చెలరేగాయి. హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం కొంతమంది కుట్రపూరితంగా తిరుమలకు వచ్చే భక్తులకు క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అలాంటి ప్రయత్నాల్లో హిందూ ధార్మికవేత్తలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు. 
 
హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ అదే ధర్మాన్ని సాకుగా చూపి శ్రీవారి సన్నిధిలో దళితులకు స్థానం లేదంటూ తితిదే తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అన్యమత ప్రచారాన్ని కట్టడి చేయాలంటే హిందూయేతరులను తితిదే నుంచి వెల్లగొట్టడమే ఏకైక పరిష్కారంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా అన్యమతస్తులుగా గుర్తించి 42మంది ఉద్యోగస్తులకు టిటిడి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు కూడా ఆందోళనలు చేపట్టాయి. 
 
వెంకటేశ్వరస్వామిని నమ్మే ప్రతి ఒక్కరు హిందువేనని, అందులో కులమతాలను చూడాల్సిన అవసరం లేదని కమ్యూనిస్టులు చేస్తున్న వాదన. పరాయిమతాన్ని ప్రచారం చేస్తూ తితేదేలో పనిచేస్తున్న ఉద్యోగులు శ్రీవారికి అపచారం చేస్తున్నారా అన్న దానిపై లోతైన పరిశీలనచేస్తే అన్యమతస్తులంటూ తితిదే నుంచి నోటీసులు అందుకున్న వారిని స్వయంగా కలుసుకుని వారి జీవన విధానాన్ని గమనిస్తే అసలు విషయం బయట పడింది. అప్పుడు నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం సర్టిఫికెట్లలో ఇండియన్ క్రిస్టియన్ అని ఉన్న కారణంగా అనువనువునా శ్రీవారి భక్తి భావాన్ని నింపుకున్న సందీప్‌ను టిటిడి నుంచి పంపించే ప్రయత్నం ఉన్నతాధికారులు చేస్తున్నారు. 
 
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి శ్రీవారినే దేవుడిగా కొలుస్తున్నానని, తమ తాతల కాలం నుంచి కూడా తామంతా హిందూ ధర్మాన్నే పాటిస్తున్నాని సందీప్ వాపోతున్నాడు. కొన్ని చిన్న తప్పిదాల కారణంగా తమ సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అని వచ్చిందని, ఇన్నేళ్ళు తితిదేలో పనిచేసిన తన పనితీరును ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం సర్టిఫికెట్లో ఉన్న కులాన్ని ఆసరాగా చేసుకుని తనకు నోటీసులు పంపడంపై ఆవేదన చెందుతున్నాడు. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తారన్న బాధ కన్నా తాను శ్రీవారి భక్తుడు కాదు అంటూ వేసిన నిందకు ఎక్కువగా బాధపడిపోతున్నాడు.