శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 నవంబరు 2015 (12:51 IST)

శ్రీవారి లడ్డూలను వదలని దళారీ వ్యవస్థ... తితిదే అధికారులు తీరు అంతేనా?

అఖిలాండ బ్రహ్మాండ నాయకుడిగా పూజలు అందుకుంటున్న కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి. తిరుమల గిరుల్లో వెలసిన తమ ఇష్ట దైవాన్ని దర్శనం చేసుకునేందుకు ఏడు కొండలెక్కి వచ్చే భక్తులు దళారుల చేతుల్లో నిలువునా మోసపోతున్నారు. దీనికి కారణం తితిదే అధికారులు అనుసరిస్తున్న వైఖరి. ముఖ్యంగా లడ్డూల పంపిణీలో తితిదే పరిపాలనా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. 
 
శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు... తమకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదం కోసం వెంపర్లాడుతారు. ఈ ప్రసాదాన్ని తమ ఇంటికి తీసుకువెళ్ళి... బంధుమిత్రులకు పంచి ఆత్మ సంతృప్తి చెందుతారు. అనాదిగా ఈ ఆచారం పాటిస్తుండటంతో... స్వామివారి లడ్డూ ప్రసాదానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే, ఈ లడ్డూల కొరత తిరుమలలో తీవ్రంగా ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఏదో విధంగా లడ్డూలను తీసుకెళ్లాలన్న ఆశతో కొండపై ఉండే దళారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా దళారులు రెండు చేతులా సంపాదిస్తూ.. భక్తులను నిలువునా ముంచేస్తున్నారు. 
 
వాస్తవానికి శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తే చాలు, దళారీ వ్యవస్థను తరిమికొట్టొచ్చు. కానీ ఇప్పటివరకు టీటీడీ అలా చేయలేకపోయింది. ఎప్పటికప్పుడు అడిగినన్ని లడ్డూలు ఇస్తున్నామని చెబుతోంది. మరి భక్తులెందుకు దళారుల దగ్గర ఎక్కువ డబ్బు చెల్లించి లడ్డూలు కొంటున్నారు? ప్రస్తుతం టీటీడీ రోజుకు 3.06 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నట్టు చెపుతోంది. కానీ, పోటు విభాగంలోని పూర్తి సిబ్బంది పని చేస్తేనే ఆ మేరకు లడ్డూలను తయారు చేయవచ్చు. లేదంటే 2.50 లక్షలకే పరిమితం కావాల్సింది. ఇంతచేస్తున్నా... లడ్డూల కొరత అలాగే ఉంటోంది. అదే దళారుల జేబులు నింపుతోంది. 
 
నిజానికి భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందిస్తామంటూ... ఆలయం బయట అదనపు లడ్డూ కౌంటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా మొదట్లో రోజుకు లక్ష లడ్డూలు అమ్మేవాళ్లు. ప్రస్తుతం ఇక్కడ 25 వేలు మాత్రమే అమ్ముతున్నారు. కారణం... ఈ కౌంటర్ ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసేస్తారో ఎవరికీ తెలియదు. సమయపాలన లేకపోవడంతో... భక్తులు దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు.. 25 రూపాయలు విలువచేసే లడ్డూను.. 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతూ ధనార్జనకు పాల్పడుతున్నారు. దీనంతటికీ కారణం తితిదే పరిపాలనా అధికారుల తీరే. మీడియా ముందు వారు చెప్పే మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేకపోవడమే ఇందుకు కారణం.