గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 16 ఆగస్టు 2020 (15:44 IST)

ప్రేమించి పెళ్లి చేసుకోవాలా లేదంటే పెళ్లి చేసుకుని ప్రేమించాలా?

ప్రేమ, ప్రేమ అంటూ కొట్టుకుపోయే మన యువతీయువకులకి శ్రీరాముడు ప్రేమంటే ఏమిటో, ఎవరిని ప్రేమించాలో తెలియజేశాడు. సీతను పెళ్లి చేసుకున్నాక ఆమెను ప్రాణాధికంగా ప్రేమించాడట. ఇది పెద్దలు కుదుర్చిన పెళ్లి కదా అని రాముడు సీతను ప్రత్యేకించి ఇష్టపడ్డాడట.

తను ధనుర్భంగం అనే పందెంలో గెలిచి చేసుకున్నదే అయినా ఆ ప్రయత్నం విశ్వామిత్రుని ఆదేశంతోనే కదా చేసింది. అనంతరం దశరథాదులందరూ అంగీకరించిందే కదా ఆ పెళ్లి. అందుకోసం రాముడు, సీత అంటే ఇష్టం కావాలనే పెంచుకున్నాడు. సీత కూడా తన గుణగణాలతోను, లక్ష్మీకళతో విలసిల్లే రూపంతోను రామునికి తనపై ప్రేమ పెరిగేలా చేసుకుంది. 
 
ఇదీ సంసారం నిలబెట్టుకునే లక్షణం. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా అని పెద్దపెద్ద చర్చలు జరుపుతున్న ఈ కాలం యువతరానికి రాముడు ఆచరించి చూపిన మార్గం ఇది. యువతీయువకులు తమ సహచరుణ్ణి లేదా సహచరురాల్ని ఎన్నుకునేందుకు అందానికి కొందరు, ఐశ్వర్యానికి కొందరు, ఆర్భాటాలకు కొందరు, అర్థం కాని, అర్థం లేని విషయాలకు కొందరు ప్రాధాన్యం ఇచ్చి పెళ్లి చేసేసుకుని ఆ తర్వాత ఒకటి వుంటే ఒకటి లేదని బాధపడుతున్నారు. 
 
పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అలా వుండవు. అమ్మాయి వరుడి అందం చూస్తే, అత్తగారు(అమ్మాయి తల్లి) ఆస్తిపాస్తులు చూస్తుందట. మామగారు అల్లుడు చదువు, ఉద్యోగం, హోదా అన్నీ చూస్తాడు. బంధువులు వంశం, సంప్రదాయం చూస్తారు. ఇతరులు పదిమందిని పిలిచి మంచి భోజనం పెట్టగలడా అని ఆలోచిస్తారట. ఇంతమంది ఇన్నీ చూస్తే ఆ బంధం ప్రబంధంలా కలకాలం వుంటుంది. అందుకే రాముడు పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుని యువకులకీ, అలా చేసుకున్న భర్తను రూపంతోనూ, గుణాలతోను ఆకర్షించి సంసారం నిలబెట్టుకోమని యువతులకి సందేశం ఇస్తున్నారు.