శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (16:19 IST)

పేడ వాసనతో గొల్లవాడైన శ్రీకృష్ణుడి జీవనం సాగింది.. చాగంటి వ్యాఖ్యలపై యాదవుల ఫైర్

యాదవులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం చాగంటి తిరుపతిలో ప్రవచనాలు చెబుతున్నప్పుడు శ్రీకృష్ణుడిపై అను

యాదవులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం చాగంటి తిరుపతిలో ప్రవచనాలు చెబుతున్నప్పుడు శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతని తల కడిగితే మొల కడగలేనటువంటి గొల్లవాని కులములో పుట్టారని, దుమ్ము, ధూళి, పేడ వాసనతో ఆయన జీవనం సాగించారని, యాదవులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని అఖిల భారతీయ యాదవ మహాసభ నేతలు పేర్కొన్నారు. 
 
ఈ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం తిరుపతిలోని జ్యోతీరావు పూలే విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. చాగంటి దిష్టిబొమ్మను తగులబెట్టారు. చాగంటి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చాగంటి చేసిన వ్యాఖ్యలను సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భగవంతుడు అనేవాడు పామరుని కులంలో పుట్టకూడదా? అంటూ యాదవ సంఘం నేతలు ప్రశ్నించారు.
 
చాగంటి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదవులతో పాటు, బీసీ కులాలన్నిఏకమై చాంగటి ఎక్కడ ప్రవచననాలు చెపితే అక్కడకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామని యాదవుల సంఘం నేతలు స్పష్టం చేశారు. ఇకపోతే.. చాగంటి ప్రవచనాలు.. కార్యక్రమాలు ఈటీవీ, భక్తి టీవీల్లో ప్రసారం అవుతాయి. ఏప్రిల్ 2016లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర ఆధ్యాత్మిక గురువుగా చాగంటిని ప్రకటించారు.