శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (10:24 IST)

మాతృభాషతోనే ఇతర భాషల అనుగ్రహం : మాడుగుల నాగఫణిశర్మ

మాతృభాష రాకుండా మరే ఇతర భాషను నేర్చుకోవడం సాధ్యం కాదని ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. మానవ సంబంధాల విశిష్టతను తెలిపే తెలుగుభాషను వదలి ఇతర భాషలను సొంతం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు అంచల సుబ్బన్న మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నాగఫణిశర్మ ప్రసంగిస్తూ.. భాష ఉచ్ఛరణలో దోషాలు ఉంటే అది మనిషిని దిగజారుస్తుందన్నారు. 
 
స్వచ్ఛమైన శబ్దానికి దివ్యశక్తి ఉంటుందని.. దోషాలు పలికితే పలికిన వ్యక్తికి కూడా దోషం కలుగుతుందన్నారు. పద్యాలు, ఎక్కాలు లాంటివి కంఠతా నేర్చుకునే సంప్రదాయం ఉండటం వల్ల తెలుగువారికి అల్జీమర్స్‌ వ్యాధి సోకే అవకాశం ఉండదన్నారు. ప్రస్తుతం బుద్ధికి ఇస్తున్న శిక్షణ తగ్గుతోందన్నారు. సుమతీ శతకం, భాస్కర శతకం, వేమన పద్యాలు పిల్లలకు నేర్పించాలని కోరారు. డాక్టర్‌ అంచల పార్థసారధి వృత్తి రీత్యా వైద్యుడైనా భాష, సంస్క్రతులపై మక్కువతో భక్తిని ఆధారం చేసుకొని రచన చేశారని కీర్తించారు.
 
అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్‌ మాట్లాడుతూ గురు శిష్య సంబంధాల్లో వస్తున్న మార్పుల వల్లనే విద్యావవస్థలో ర్యాగింగ్‌.. ఆత్మహత్యలులాంటివి చూస్తున్నామన్నారు. కళాశాలల్లో సీసీ కెమారాలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తోందో ఉపాధ్యాయులు ఆలోచించాలన్నారు. విద్యార్థులపై గురువులకు సాధికారికత ఉండాలని అభిలషించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంచల పార్ధసారధి తండ్రి తన పిల్లలందరినీ సమాజానికి ఉపయోగపడేవిధంగా తీర్చి దిద్దారని.. ఇది అందరు తల్లిదండ్రులూ ఆచరించాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో వినియోగతత్వం పోవాలని ఆకాంక్షించారు. దేశభవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు.