శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎనిమిది దేశాలు, 13 నగరాల్లో కళ్యాణోత్సవం
శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రపంచ వ్యాప్తంగా శ్రీనివాస కల్యాణోత్సవం జరుగనుంది. నవంబర్ 9, 2024 నుండి డిసెంబర్ 21, 2024 వరకు ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీ వేంకటేశ్వర శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నట్లు ఎన్ఆర్ఐ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ప్రకటించారు.
దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో జర్మనీలోని శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్‌కు చెందిన కార్యక్రమ సమన్వయకర్త సూర్య ప్రకాష్ వెలగా, వెంకట కృష్ణ జవాజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (జిఎడి పొలిటికల్) కె. సురేష్ కుమార్, ఎపిఎన్‌ఆర్‌టిఎస్ సిఇఒ పి.హేమలత రాణి తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎన్నార్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ), తిరుమల తిరుపతి దేవస్థానాలు, అతిధేయ దేశాల్లోని స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి యూకే, ఐర్లాండ్, యూరప్‌లలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని కల్యాణాల్లో భక్తులకు ప్రవేశం ఉచితం. తిరుమలకు చెందిన టీటీడీ అర్చకులు, వేదపండితులు అన్ని దేశాల్లో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం క్రతువులను నిర్వహించనున్నారు.