శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 20 నవంబరు 2014 (18:35 IST)

పెద్ద శేష వాహనంపై అమ్మవారు... భక్తులకు కనువిందు...

కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారు గురువారం ఉదయం పెద్దశేష వాహనంపై ఊరేగారు. ఏడు పడగల పెద్ద శేషవాహనంపై అమ్మావారు భక్తులకు దర్శనమిచ్చారు. మహా విష్ణువుకు ఆదిశేషుడు ప్రచండ సేవకుడిగా ప్రతీతి. పవళించే పరుపుగా, దిండుగా, గొడుగుగా, ఆభరణంగా ఆది శేషుడు మహావిష్ణువుకు సేవలు అందిస్తుంటారు. ఈ సేవలను పరిగణలోకి తీసుకుని ఆదిశేషుడిని ప్రచండ సేవకుడిగా పేరొందారు. 

 
ఈ వాహనంపై పద్మావతీ అమ్మవారు తిరుమాడ వీధులలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ ఊరేగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు పెద్దశేషవాహనంతో ఆరంభమైతే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు చిన్న శేష వాహనంతో ఆరంభమవుతాయి. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీగోపాల్, జేఈవో పోలా భాస్కర్, సివిఎస్వో జి. శ్రీనివాస్, డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మి, ఏఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు.