శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 13 నవంబరు 2014 (13:38 IST)

అన్యమత ప్రచారానికి టీటీడీ భద్రతా అధికారులే కారణం : స్వరూపానందేంద్ర స్వామి

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం సాగడానికి ప్రధాన కారణం తితిదే భద్రతా అధికారుల లోపమేనని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
హిందూ పుణ్యక్షేత్రాల వద్ద అన్యమత ప్రచారాన్ని అరికట్టాలంటే చట్టంలో మార్పులు రావాలని అన్నారు. టీటీడీ, భద్రత సిబ్బంది వైఫల్యం వల్లే పాస్టర్‌ సుధీర్‌ ఆలయం దగ్గర అన్యమత ప్రచారం చేశారన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అన్యమత ప్రచారాన్ని అరికట్టేందుకు పీఠాధిపతుల సూచనలు స్వీకరించాలని వెల్లడించారు. 
 
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో హిందువులే పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర కోరారు. మహామణి మండపం తిరుమలలో నిర్మించటం మంచిది కాదని అయన వ్యాఖ్యానించారు. తిరుపతి, తిరుచానూరులో నిర్మిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట మహామణి మండపం నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే.