శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2015 (16:34 IST)

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సామాన్య భక్తులకే పెద్దపీట.. 6లక్షల లడ్డూలు సిద్ధం!

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని ఈఓ సాంబశివరావు వెల్లడించారు. వచ్చే నెల 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో.. తిరుమలలో దర్శనం, ఆర్జిత సేవలు వంటి ఇతరత్రా విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. 
 
మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. సాధ్యమైనంత ఎక్కువ సేపు స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామన్నారు. గరుడోత్సవం రోజున వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈవో వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ 24 గంటల పాటు కనుమ రహదారుల్లో వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపారు. 
 
అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేశామని, భక్తుల కోసం 6 లక్షల లడ్డూలను సిద్ధం చేయనున్నామని ఈవో సాంబశివరావు వెల్లడించారు. శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులు తుది దశకు చేరుకున్నాయని, బ్రహ్మోత్సవాల భద్రత కోసం కొత్తగా 300 సీసీ కెమెరాలను అమర్చనున్నామని వివరించారు.