గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By మనీల
Last Modified: శనివారం, 5 అక్టోబరు 2019 (15:10 IST)

ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?

ప్రేమ అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. వయస్సులో ఉన్న ఇద్దరు ఆడామగా కలిసి అలా బయట తిరుగేస్తుంటారు. అలానే ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూసుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. ఇవేవీకాకపోతే శూన్యంలో పిచ్చి చూపులు చూస్తూ తన ప్రేయసి లేదా ప్రియుడి గురించే నిత్యం తపిస్తూ ఉంటారు. ఇలాగే కాకున్నా ప్రేమ అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే అంశాలు ఇవే. 
 
అయితే ప్రేమ ప్రారంభంలో ప్రతి ఒక్కరిలో ఇలాంటి లక్షణాలే ఉన్నా ఓ ఆడా మగ మధ్య పుట్టిన ప్రేమ భవిష్యత్‌లో కూడా చెక్కు చెదరకుండా అలానే ఉండాలంటే మాత్రం వారి మధ్య అనుబంధం అనేది ఏర్పడాలి. అలా అనుబంధం అనే పునాది ఏర్పడితే ప్రేమ అనే బంధం చెక్కు చెదరకుండా జీవిత పర్యంతం కొనసాగుతుంది. 
 
ప్రేమలో పడ్డ కొత్తల్లో ఎదుటివారిపై కలిగేది వ్యామోహమో, ప్రేమో ఖచ్చితంగా గుర్తించడానికి వీలుకాదు. వారినే పదే పదే చూడాలనుకోవడం, వారు కనబడగానే దేహంలో ఏదో కొత్త ఉత్తేజం అడుగు పెట్టడం, మనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చిగురించడం వంటి లక్షణాలన్నీ ప్రేమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అందరిలోనూ కన్పించేవే. 
 
అయితే ఎదుటివారిపై ఉన్నది ప్రేమ కాకుండా వ్యామోహమైనా కూడా దాదాపు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. అయితే ఈ కొద్దిరోజులు నిదానించగల్గితే ఎదుటివారిపై కలిగిన ఆకర్షణలో కొంత ఖచ్చితత్వం వస్తుంది. ఎలాగంటే ఎన్నిరోజులు గడిచినా తొలిరోజు కలిగిన ఆకర్షణ అలాగే కొనసాగగల్గితే అలాంటివారిలో ప్రేమభావం ప్రవేశించిందన్నమాటే. అలాకాక కొన్నాళ్ల తర్వాత వారిని చూచినపుడు కల్గినంత వ్యామోహం వాళ్లు ఎదురుగా లేనపుడు కలగకపోతే అది ఖచ్చితంగా ప్రేమకాదు.