బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో మెరిసిన అమలాపురం కుర్రాడు
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సెమీ ఫైనల్‌కి చేరుకున్నాడు అమలాపురం కుర్రాడు.. భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. మహారాష్ట్రకి చెందిన తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి అమలాపురం కుర్రాడు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పతకం అందుకోబోతున్న భారత మెన్స్ డబుల్స్ తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ శెట్టి జంట రికార్డు కెక్కనుంది.
ఓవరాల్ గా ఈ మెగా టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇది రెండో పతకం కానుంది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది.
టోక్యో వేదికగా జరుగుతున్న తాజా టోర్నీలో భారత్ నుంచి సాత్విక్- చిరాగ్ జంట మాత్రమే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ జంట 24-22, 15-21, 21-14తో జపాన్‌కు చెందిన టకుర హొకి- యుగో కొబయాషి జంటపై మూడు గేమ్స్‌పై పోరాడి అద్భుత విజయం సాధించింది.