1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (09:00 IST)

బీఎండబ్ల్యూ కారును అమ్మకానికి పెట్టిన భారత అథ్లెట్.. ఎందుకు?

బీఎండబ్ల్యూ కారు కొనాలని, అందులో చక్కర్లు కొట్టాలని ప్రతి ఒక్కరూ కలకంటుంటారు. కానీ, ఓ అథ్లెట్‌కు బహుమతిగా వచ్చిన ఈ కారును దానిని నిర్వహించే స్థోమత లేక విక్రయానికి పెట్టింది. ఆ అథ్లెట్ ఎవరో కాదు.. ద్యూతీచంద్. భారత అథ్లెట్. 
 
మన దేశ అథ్లెట్ రంగంలో ఎంతో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకున్న యువ స్ప్రింటర్ ద్యుతీచంద్. ఈమెకు బహుమతిగా వచ్చిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారును అమ్మకానికి పెట్టింది. 
 
ఆమె తన కారును అమ్ముతున్నట్టు ట్వీట్ చేయడం, ఆపై వెంటనే తొలగించడం మరింత ఆసక్తి కలిగించింది. శిక్షణకు డబ్బుల్లేక ఖరీదైన కారును అమ్మేస్తోందని ప్రచారం జరిగింది. 
 
దీనిపై ద్యుతీచంద్ వివరణ ఇచ్చింది. శిక్షణకు డబ్బుల్లేక కారును అమ్ముతున్నట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. తాను బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కారును మెయింటైన్ చేయలేకపోతున్నానని, ఆ కారు నిర్వహణ వ్యయాన్ని భరించలేకపోతున్నానని వెల్లడించింది. 
 
అంతటి కారును భరించే ఆర్థిక స్తోమత లేదని వివరించింది. అయితే కారును అమ్మితే వచ్చే డబ్బును తన శిక్షణ కోసం కూడా ఉపయోగిస్తానని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఒడిశా సర్కారు, తాను చదువుకున్న కేఐఐటీ వర్సిటీ ఎంతో చేయూత అందించాయని గుర్తు చేశారు. 
 
కరోనా పరిస్థితులు సద్దుమణిగాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు రాగానే, మళ్లీ ఆ కారును దక్కించుకుంటానని ద్యుతీచంద్ వివరించింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి, వర్సిటీకి తన కారణంగా ఆర్థిక ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నానని వివరించింది.