గల్లీ బుద్దులు చూస్తుంటే జాలేస్తుందిరా బయ్... బిడ్డా తీసేసి చూడు: కేసీఆర్‌కు బాలయ్య ఛాలెంజ్

balakrishna
Last Updated: సోమవారం, 3 డిశెంబరు 2018 (11:54 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌లపై సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో చంద్రబాబు చరిత్ర చెరిపేయాలంటే హైటెక్ సిటీ తీసెయ్యాలి, ఫ్లై ఓవర్లు మాయం చేయాలి అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాలయ్య పాల్గొని తెరాస సర్కారు పాలన, కేసీఆర్, కేటీఆర్‌లపై తూర్పారబట్టారు. బిడ్డా.. మీ గల్లి బుద్దులు చూస్తుంటే జాలేస్తుందిరా బయ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు చరిత్ర చెరిపేయాలంటే హైటెక్ సిటీ తీసెయ్యాలి, ఫ్లైఓవర్లు మాయం చేయాలి, రింగ్ రోడ్డును అదృశ్యం చేయాలి, ఆ దమ్ము, ధైర్యం మీకున్నాయా? ఉంటే బిడ్డా తీసేసి చూడు అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు.. మీది లాటరీ .. చంద్రబాబుది హిస్టరీ. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలంటే దునియాపై మూకుడు కప్పేయడమే అవుతుందన్నారు.

తెలంగాణలో రైతుల రాజ్యం వస్తుందనుకుంటే రాబందుల రాజ్యం వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడంతోనే వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ల్యాప్‌టాప్ కనిపెట్టింది మీరేనా అంటూ ఎద్దేవా చేయడం తగదు భాయ్ అంటూ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి వలసల రూపంలో కారెక్కినవారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి, గుణపాఠం చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.దీనిపై మరింత చదవండి :