శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (10:18 IST)

టి పోల్స్ : రోజూ పాత బ్రాండేనా? విదేశీ బ్రాండ్లపై మోజు... దుకాణాల్లో అభ్యర్థుల పేరుతో ఖాతా

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లు, మద్యంబాబులు కనిపిస్తున్నారు. అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా 20శాతం మేరకు మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. 
 
ఎన్నికల నేపథ్యంలో అనేక మంది అభ్యర్థులు, నేతలు మందునే నమ్ముకున్నారు. అడిగిన వాళ్లు అడిగినంత పోస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ఫలితంగా అంచనాలను మించిన మద్యం అమ్మకాలు జరిగాయి.
 
గతంతో పోల్చితే ఈ పెరుగుదల సగటున 20 శాతంగా నమోదైంది. ఇంటింటికీ మందు అందిస్తే ఇబ్బందులు అని భావించిన అభ్యర్థులు దుకాణాల్లోనే ఖాతాలు ప్రారంభించారు. ఆ ఖాతాలో మద్యం తీసుకొని తాగే విధానాన్ని ప్రారంభించారు. 
 
ఇక ఎన్నికల నేపథ్యంలో రోజూ తాగే బ్రాండు తాగేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఖరీదైన మద్యాన్ని తాగేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో మద్యం దుకాణాల్లో రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయి. 
 
మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రంలో గుడుంబా పూర్తిస్థాయిలో నిర్మూలించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇదిలావుంటే ఎన్నికల నేపథ్యంలో తక్కువ ధర మద్యం కంటే ఎక్కువ ధర ఉండే మద్యం సీసాల వినియోగం భారీగా పెరిగింది. ఒక్క బీరు అమ్మకాలే 20శాతం వరకు పెరిగాయి. యువకులు విదేశీ మద్యాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తునట్లు తెలుస్తోంది. 
 
పోలింగ్ సందర్భంగా 7వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మొత్తానికి ఎన్నికల కారణంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మరి ఎవరికి కిక్కు నిస్తుందో చూడాలి.