శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:46 IST)

కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిపై రాళ్ళదాడి.. వరంగల్‌లో రూ.7 కోట్లు స్వాధీనం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా, అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఇదిలావుంటే, ఉదయం నుంచి ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల్లో ఒక్కసారి అలజడి చెలరేగింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకటైన కల్వకుర్తిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అమనగల్లు మండలం జంగారెడ్డి పల్లెలో ఓ బూత్‌ను పరిశీలించేందుకు వంశీచంద్ అక్కడకు వెళ్లారు.
 
ఆ సమయంలో ఆయనపై ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వంశీచంద్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనపై అధికార తెరాస - బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, ఇక్కడ బీజేపీ నుంచి టి.ఆచారి పోటీ చేస్తున్నారు. 
 
మరోవైపు, ఎన్నికల అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పోలింగ్ జరుగుతున్న సమయంలో సుమారు రూ.7 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నర్సంపేట నియోజకవర్గంలోని దాసరిపల్లిలో ఓ ఇంట్లో ఈ డబ్బును ఈసీ అధికారులు సీజ్ చేశారు. అయితే, దీనిపై పూర్తి వివరాలతో పాటు అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.