శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (13:28 IST)

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు వర్షాలే వర్షాలు

Rains
తెలంగాణా రాష్ట్రంలో మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటిపూట ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటే సాయంత్రానికి వర్షం పడుతుంది. దీంతో తెలంగాణ వాసులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. 
 
బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇందుకు కారణం వాతావరణంలో నెలకొన్న అనిశ్చితితో పాటు ద్రోణి ప్రభావమేనని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 
 
గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, పాలమూరు, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైపు, ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు అందివచ్చిన పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 
 
అందువల్ల ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం జలమయమైన విషయం తెల్సిందే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.