1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

బాడీబిల్డర్‌కు ప్రాణదానం చేసిన సోనూసూద్.. ఎలా?

కరోనా మహమ్మారి కష్టకాలంలో అనేక మందికి ఆపద్బాంధవుడుగా కనిపించిన ఒకేఒక వ్యక్తి సినీ విలన్ సోనూ సూద్. ఈయన లక్షలాది మంది తనవంతు సాయం చేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అనేక మంది ప్రాణాలు నిలబెట్టాడు. తాజాగా ఓ బాడీబిల్డర్‌కు కూడా  ప్రాణదానం చేశాడు. 
 
కరోనాతో చావు అంచులకు చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ బాడీబిల్డర్‌ సోనూసూద్ సాయంతో తిరిగి కోలుకున్నాడు. అతని పేరు సుశీల్ కుమార్ గైక్వాడ్ (32). హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి ప్రాంత వాసి. బాడీబిల్డింగ్‌లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 
 
ఈయనకు ఏప్రిల్ నెలాఖరులో కరోనా బారినపడిన సుశీల్ కుమార్ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న మరో ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ బెడ్లు దొరక్కపోవడంతో ఆందోళన మొదలైంది.
 
దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే నటుడు సోనూసూద్ సాయం అర్థించారు. ఆయన వెంటనే స్పందించడంతో మే 19న సుశీల్ కుమార్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడి ఊపిరితిత్తులు 80 శాతం ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు వైద్యులు గుర్తించారు. 
 
సుదీర్ఘ చికిత్స అనంతరం ఎక్మో చికిత్స అవసరం లేకుండానే సుశీల్ కోలుకున్నాడు. దీంతో తాజాగా సుశీల్ కుమార్‌ను డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. కొవిడ్ సోకకముందు 100 కిలోలకు పైగా ఉన్న సుశీల్ కుమార్ ప్రస్తుత బరువు 72 కిలోలకు తగ్గిపోయిందని చెప్పారు.