ఆ రెండు టీకాలతో వీర్యకణాలు తగ్గవు!
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. దీంతో వివిధ ఫార్మా దిగ్గజాలు వివిధ పేర్లతో వ్యాక్సిన్లను తయారు చేసి అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ టీకాలు వేసుకోవడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందనే ప్రచారం సాగుతోంది.
అయితే, ఫైజర్, మోడెర్నా టీకాలు వేసుకోవడం వల్ల ఏమాత్రం హాని కలిగించవని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వీర్యకణాల సంఖ్యను అవి తగ్గించవని నిర్ధారించింది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వాలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఇందులోభాగంగా, తొలి డోసు వేయడానికి 2-7 రోజుల ముందు వాలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. రెండో డోసు పూర్తయ్యాక దాదాపు 70 రోజులకు మరోసారి వీర్యం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా.. వీర్యం పరిమాణం, గాఢత, వీర్యకణాల చలనశీలత వంటి అంశాలను పరిశీలించారు.
టీకా వేయించుకున్నాక ఏ ఒక్కరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గలేదని గుర్తించారు. వాస్తవానికి రెండు డోసులు పూర్తయ్యాక వారిలో వీర్యకణాల సంఖ్య, చలనశీలత కొంతమేరకు మెరుగైందని పేర్కొన్నారు. ఫైజర్, మోడెర్నాల్లో సజీవ వైరస్ కాకుండా ఎంఆర్‌ఎన్‌ఏ ఉంటుందని పరిశోధకులు గుర్తుచేశారు. వీర్యంపై అవి ప్రభావం చూపే అవకాశాల్లేవని తేల్చిచెప్పారు.