మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (23:11 IST)

స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు.. కేసీఆర్ కేబినెట్ ఆమోదం

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో తొలుత తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే సీఎం పరిశ్రమల శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి శ్రీ కెటి రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది. దీనిపై కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది.
 
తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
 
స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అటు హైదరాబాద్ నగరంలో ఐటి పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటి కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్ (growth in dispersion) పాలసిని కేబినెట్ ఆమోదించింది.
 
పెరిగి పోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ రాష్ర్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజైన్లను ఆమోదించింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసి విర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. 
 
పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది.