బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (13:50 IST)

సాగర్‌పై కేసీఆర్ వరాల జల్లు: దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,72,282 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి 3,55,727 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.20 టీఎంసీలు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 305 టీఎంసీలు ఉన్నది. మరో వైపు ఎగువన ఉన్న శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది.
 
ఈ నేపథ్యంలో కోవిడ్ కారణంగా జిల్లా పర్యటన ఆలస్యమైందని సీఎం కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అన్నారు. సోమవారం ఆయన హలీయాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. 
 
హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నెల రోజుల్లో హక్కు పట్టాలు ఇస్తామన్నారు. 
 
గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నందికొండ మున్సిపాలిటీలో ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్‌కు వరాల వర్షం కురిపించారు. 
 
''నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తాం. దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం. జానారెడ్డి మాట తప్పి సాగర్‌లో పోటీ చేశారు. దళితబంధు పథకంపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. 12లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం తప్పకుండా చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధు అమలు చేస్తాం. దళితబంధు పథకంతో విపక్షాలకు బీపీ మొదలైందని'' సీఎం కేసీఆర్‌ అన్నారు.