గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (14:12 IST)

తెలంగాణలో కోకాకోలా కంపెనీ భారీ పెట్టుబడులు

coco cola
తెలంగాణ రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను విస్తృతంగా విస్తరించేందుకు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న సంస్థ తాజాగా అదనపు పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావుతో జరిగిన సమావేశంలో కంపెనీ తన ప్రణాళికలను ప్రకటించింది. 
 
మంత్రి కేటీఆర్‌తో కోకాకోలా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ మేక్ గ్రివీ సమావేశమయ్యారు. తమ కంపెనీకి ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని, భారత్‌లో తమ కార్యకలాపాలు, వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు. 
 
ఇందులో భాగంగా అమీన్‌పూర్‌లో కంపెనీకి చెందిన భారీ బాట్లింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలో 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. దీనికి తోడు సిద్దిపేట జిల్లాలో రూ.1000 కోట్లతో కొత్త బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణానికి ఏప్రిల్ 22న తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఈ మేరకు అక్కడ నిర్మాణ కార్యకలాపాలను కంపెనీ కొనసాగిస్తుందని తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం, తమ ప్లాంట్‌ నిర్మాణంలో వేగం, ఈ ప్రాంతంలో వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకుని కోకాకోలా కంపెనీ ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ప్లాంట్‌లో అదనంగా రూ.647 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్లాంట్ డిసెంబర్ 24 నాటికి పూర్తవుతుంది.
 
ప్రతిపాదిత కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో పెట్టుబడులను కలుపుకుంటే, కోకాకోలా కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 2500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని కోకాకోలా కంపెనీ అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.