శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (10:39 IST)

పెండింగ్ చలానా ఉంటే బండి సీజ్: తెలంగాణ పోలీసులు క్లారిటీ

రోడ్డు నిబంధనలు మీరినందుకు మీ వాహనంపై చలానా పడిందా? అది చెల్లించకుండా అంతే రోడ్డుపైకి వస్తే వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందంటూ ఇటీవల విపరీతమైన ప్రచారం జరిగింది. ఓ లాయర్‌కు చెందిన బైక్‌ను ట్రాఫిక్ పోలీసు సీజ్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త పాకిపోయింది. పెండింగ్ చలానాలు ఉండి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసుకు పట్టుబడితే ఇక బండి సీజ్ చేయొచ్చని, అందుకే ఆ పోలీస్ జప్తు చేశాడని వీడియో వైరల్ అయింది. దీంతో పెండింగ్‌ చలానాలున్న వాహనదారులు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. 
 
ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్క పెండింగ్‌ చలానా ఉన్నా వాహనం జప్తు చేయొచ్చని ఓ ట్రాఫిక్‌ అధికారి చెప్పినట్లుగా వీడియో బయటికి రావడంతో భయం మరింత పెరిగింది. అయితే, దీనిపై తెలంగాణ హైకోర్టు ఇటీవల క్లారిటీ ఇచ్చింది. దీంతో వాహనాలను సీజ్ చేసే అంశంపై స్పష్టత వచ్చినట్లయింది.
 
వాహనాలపై ఎన్ని పెండింగ్ చలానాలు ఉన్నా సరే.. వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు పోలీసుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి బండిని పోలీసులు సీజ్ చేయగా.. అది సరికాదంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఏదైనా వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ స్పష్టం చేసింది.
 
అయితే ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా వాహనాన్ని జప్తు చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదని.. తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లుగా పేర్కొంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌ అవాస్తవమని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తేల్చారు. హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఆపేయాలని హెచ్చరించారు.
 
సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్‌ రూల్స్‌ (సీఎంవీఆర్‌)-1989 రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు ఉందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సంబంధిత పెండింగ్‌ చలానా గురించి వాహనదారునికి ఎలక్ట్రానిక్‌ రూపంలో లేదా కాల్‌ ద్వారా పోలీసులు ఒక్కసారైనా తెలియజేస్తే చాలని పేర్కొన్నారు.
 
ఏమైనా ట్రాఫిక్‌ ఉల్లంఘన చలానాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులదే. ఒకవేళ వాహనదారులు ఏమైనా వ్యత్యాసం గమనిస్తే ఆన్‌లైన్‌ ద్వారా అధికారులకు నివేదించవచ్చు. సాక్ష్యాలను ధ్రువీకరించి సరిదిద్దుకోవచ్చని వారు సూచించారు.