శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (09:17 IST)

నామినీలతో డీల్.. పాలసీదారుల హత్య.. నల్గొండలో నరహంతక ముఠా!

బీమా సొమ్ముకు కక్కుర్తిపడిన ఓ కసాయి ముఠా బీమా పాలసీదారులను చంపేస్తూ వస్తోంది. ముందుగానే నామినీదారులతో ఒప్పందం కుదుర్చుకుని ఆ తర్వాత పాలసీదారులు వాహనం తీసుకెళ్ళి హత్య చేసి.. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 17 మంది ముఠా సభ్యులున్న ఈ ముఠా ఇప్పటివరకు ఐదుగురుని చంపేసింది. ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను సేకరించిన అనంతరం ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పిస్తారు. ఒకటి రెండు ప్రీమియంలను వారే చెల్లించేస్తారు.
 
ఆ తర్వాత ముఠా సభ్యులు తమ పథకాన్ని అమలు చేస్తారు. బీమా చేయించుకున్న వ్యక్తి నామినీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. అనంతరం బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఆపై వాహనంతో గుద్దించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తారు. 
 
ఆపై ఎఫ్ఐఆర్ కాపీ సేకరించి బీమాకు క్లెయిమ్ చేస్తారు. వచ్చిన మొత్తంలో కుటుంబసభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా మొత్తాన్ని అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్టు సమాచారం.
 
దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు.