గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (20:06 IST)

అవినీతిలో కేసీఆర్ కుటుంబం: బీజేపీ

తెలంగాణ అమరవీరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబానికి భోగంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు.

ఈ కార్యక్రమానికి లక్ష్మణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంతో పాటు మంత్రులు కూడా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. వరంగల్‌లో ఓ టీఆర్‌ఎస్‌ ఎంపీ ఆర్టీసీకి చెందిన స్థలాన్ని ఆక్రమించాడన్నారు.

బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌కు నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ వెళితే కనిపిస్తుందన్నారు. నిజామాబాద్‌లో కవితను ఓడించింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకుల ఆగడాలు మితిమీరడంతో ఎక్కువ మంది బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.

బాధితులెవరైనా బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌, కేసీఆర్‌ దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో 6 కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తే మోదీ ప్రభుత్వం కేవలం 6 సంవత్సరాలలోనే 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 
 
అయోధ్యపై వ్యాఖ్యలొద్దు: బీజేపీ
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో జాతీయ పార్టీ విధాన నిర్ణయం తీసుకునే వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఊరేగింపులు, ప్రదర్శనలు, నినాదాలు చేయొద్దని స్పష్టం చేసింది.

పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అధ్యక్షతన అందుబాటులో ఉన్న పార్టీ పదాధికారులతో సమావేశం జరిగింది. మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో పార్టీ కమిటీలను వెంటనే నిర్వహించాలని నిర్ణయించారు. మండల, జిల్లా కమిటీలను ఈ నెల 3వ వారంలోగా పూర్తి చేయాలని లక్ష్మణ్‌ ఆదేశించారు.