గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (18:26 IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మహర్షి: కేటిఆర్

‘తనకోసం పనిచేసేవాడు మనిషి.... పదిమంది కోసం పనిచేసేవాడు మహర్షి... అది మన సిఎం కేసిఆర్’ అని చెప్పిన ఇక్కడి గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మాటలు ఎంతో స్పూర్తినిస్తున్నాయని రాష్ట్ర పురపాలక, ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు.

విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తు కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని ఈరోజు వేదిక మీద ఉన్న ఈ యువ పారిశ్రామికవేత్తలు నిరూపించారన్నారు.

సిఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం కింద 2019 బ్యాచ్ కోసం 100 మంది పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసిన సందర్భంగా గచ్చిబౌలి, ఐఎస్‌బిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి కేటిఆర్, గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, ఎస్.బిఐ డిజిఎం దేబాశిష్ మిశ్రా, ఐఎస్‌బి డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ... పట్టుదల, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పడానికి సిఎం కేసిఆర్ ను మించిన ఉదాహరణ లేదన్నారు.

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను పట్టుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమంటే...దానిని సుసాధ్యం చేసి నిలుపడానికి ఆయన పట్టుదల, నిరంతర కృషియే కారణం అన్నారు. అలాగే ఈ రోజు ఇక్కడ పారిశ్రామిక వేత్తలుగా ఎంపికైన గిరిజన యువతను చూస్తుంటే వారికున్న ఆసక్తి, పట్టుదల కనిపిస్తోందన్నారు.

తాను విదేశాలకు వెళ్లినప్పుడు పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలను కలుస్తూ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాని, అయితే ఈరోజు ఈ గిరిజన ఔత్సాహికులకు పారిశ్రామికవేత్తలు అయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోషం, సంతృప్తి అప్పుడు కలగలేదన్నారు.
 
పెద్దపెద్ద పరిశ్రమలు ఉన్నా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.     
 
పరిశ్రమలు కొత్తగా పెట్టిన ఉన్నత స్థాయిలో ఉంటాయని, రాను, రాను కొన్నిసార్లు నష్టాల్లోకి కూరుకుని ముందుకు నడిపించడమే కష్టంగా మారుతాయని, అలాంటి వారికి వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేశామన్నారు.

దీనిద్వారా ఏదైనా పరిస్థితుల్లో ఒకటి, రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు బ్యాంకులకు కట్టలేకపోతే ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కులలో గ్రామీణ యువతకు, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. 
 
ఐఎస్‌బిలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో పరిశ్రమలు పెట్టే ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను వస్తానని, తనతో పాటు సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తిగా అండగా ఉంటానని మంత్రి కేటిఆర్ గారు హామీ ఇచ్చారు.
 
సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయకుండా, ఆసక్తి, పట్టుదల కోసం వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారికి ఇండస్ట్రియల్ పార్కులలో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు. మంచి శిక్షణ ఇచ్చి, వీరిని పారిశ్రామికవేత్తలుగ మార్చేందుకు తోడ్పడిన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ని, అధికారులను ఆయన అభినందించారు. 
 
సమావేశంలో గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.... గిరిజనులకు పరిశ్రమలు పెట్టడం ఒక కల అని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీర్వాదం వల్ల ఆ కల నేడు నిజం అయిందన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంతగా మనసుపెట్టి పనిచేసే సిఎం మరొకరు లేరన్నారు.

ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు, ఆ తర్వాత తల్లి అయిన తర్వాత తల్లి, బిడ్దల సంక్షేమం కోసం కూడా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక సిఎం దేశంలో కేసిఆర్ గారు ఒక్కరేనని అన్నారు.
 
అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేనన్ని గిరిజన గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యనందిస్తున్న గురువుగా కేసిఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్పారు. గిరిజనులు పారిశ్రామికవేత్తలు కావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపొందించి, నేడు నా గిరిజన బడ్డలు ఐఎస్‌బిలో నిలబడి మాట్లాడే గొప్ప అవకాశాన్ని ఇచ్చారన్నారు. 
 
పారిశ్రామికవేత్తలకే కాకుండా ఒక సాధారణ గిరిజన తండాలో పుట్టిన నాకు కూడా క్యాబినెట్లో రెండు శాఖలు ఇచ్చి మంత్రిని చేసిన కేసిఆర్ గారికి పాదాభివందనం అన్నారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలు చేసే ఈ కార్యక్రమానికి హాజరై స్పూర్తినిచ్చిన మంత్రి కేటిఆర్ కి ధన్యవాదాలు అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచమంతా చూసేలా చేసిన మంత్రి కేటిఆర్ నేడు యువతకు ఒక రోల్ మోడల్, ఐకన్ గా మారారని, ఇంతటి సమర్థత ఉన్న మంత్రి మనకుండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 
 
సమావేశంలో గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా మాట్లాడుతూ... గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా మార్చే కార్యక్రమం మంత్రులు కేటిఆర్, సత్యవతి రాథోడ్ సమక్షంలో జరగడం ఒక సుదినమన్నారు.

గిరిజనుల పారిశ్రామికవేత్తలుగా మార్చే ఈ పథకం ముఖ్యమంత్రి ఆలోచననుంచే పుట్టిందని, దీంతో పాటు దేశం గర్వించే అనేక పథకాలు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ రూపొందించి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకం కింద గత ఏడాది వందమందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామని, ఈ సంవత్సరం కూడా మరో వందమందికి ఎంపిక చేశామన్నారు.
 
సమావేశంలో గిరిజన శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జోంగ్తూ మాట్లాడుతూ...గిరిజన ఔత్సాహిక యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రోత్సాహం, ఐఎస్బీ సహాకారం చాలా ముఖ్యమైందని అన్నారు. 2019 బ్యాచ్ లో గతంలో కంటే ఎక్కువ మంది వివిధ గిరిజన తెగలకు సంబంధించిన యువత పారిశ్రామికవేత్తలుగా ఎంపికైందని, వీరందరికీ శుభాకాంక్షలు అని చెప్పారు. 
 
కేసిఆర్ మహర్షి.... ఔత్సాహిక పారిశ్రామికవేత్త రమేష్
తనకోసం పనిచేసే వాడు మనిషి...పదిమంది కోసం పనిచేసేవాడు మహర్షి అని, ఈరోజు ఇంతమంది గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా చేసిన సిఎం కేసిఆర్ మహర్షి అని నిజామాబాద్ జిల్లా, రామచంద్రపురం తండాలకు చెందిన రమేష్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త అభివర్ణించారు.

గిరిజనులు పరిశ్రమలు పెట్టడమనేది ఒక కల అని, దానిని సిఎం కేసిఆర్ నిజం చేసి చూపారన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు తాను ఒక సంస్థలో ఉద్యోగినని, ముఖ్యమంత్రి కేసిఆర్ పెట్టిన ఈ పథకం ద్వారా ఈ రోజు ఉద్యోగి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయి కి ఎదిగానని, ఇంతకంటే సిఎం కేసిఆర నుంచి ఏమి ఆశించాలన్నారు. 
 
మరొక మహిళా పారిశ్రామికవేత్త కుల్సుం గౌతమి మాట్లాడుతూ...నేను కూడా పరిశ్రమ పెట్టాలి, దాని ప్రారంభోత్సవానికి మంత్రి కేటిఆర్ ని పిలిచి, ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టుకోవాలని అనుకునే దాన్ని కానీ నేడు ఈ పథకం ద్వారా ఈ కల నిజం అవుతుందన్నారు.

దీనిని విన్న మంత్రి కేటిఆర్ వెంటనే ఆ మహిళా పారిశ్రామికవేత్తను పిలిచి నీ పరిశ్రమ ప్రారంభించే రోజు చెబితే కచ్చితంగా తాను వస్తానని హామీ ఇచ్చారు. సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం కింద ఐఎస్ బిలో శిక్షణ తీసుకోవడం వల్ల తమ ఆలోచన విధానమే మారిందన్నారు. 
 
ఈ సమావేశంలో గిరిజన శాఖ అధికారులు, ఐఎస్ బి ప్రతినిధులు, ఎస్.బి.ఐ ప్రతినిధులు, మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినిలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గిరిజన సంక్షేమ శాఖ తరపున మంత్రి సత్యవతి రాథోడ్, అధికారులు కలిసి మంత్రి కే.టి.ఆర్ కి మెమెంటో అందించారు. అనంతరం నూతన పారిశ్రామిక వేత్తలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.