శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (16:50 IST)

ఖమ్మంలో బిగ్‌ఫైట్‌ .. ఆర్థిక దిగ్గజాల హోరాహోరీ

ఒకప్పుడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఖమ్మం సెగ్మెంట్లో తొలిసారిగా జెండా ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. అదేసమయంలో జిల్లాలో మసకబారిన ప్రాబల్యాన్ని తిరిగి రాబట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎత్తులు వేస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. కానీ, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చక్రం తిప్పడంతో మున్సిపాలిటీ తెరాస వశమైంది. 
 
పైగా తుమ్మల రాజకీయంతో అప్పటివరకు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్న పువ్వాడ అజయ్ కుమార్ రాత్రికి రాత్రే కారెక్కేశారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపైనే అజయ్ పోటీ చేస్తున్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీ తరపున లోక్‌సభ మాజ సభ్యుడు నామా నాగేశ్వర రావు బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ఆర్థికంగా ఉద్ధండులు. ఫలితంగా ఖమ్మం అసెంబ్లీ స్థానం కోసం జరిగే ఎన్నికల్లో ఇద్దరు ఆర్థిక దిగ్గజాల మధ్య జరిగే పోరుగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్నారు. 
 
నిజానికి ఈ ఇద్దరు నేతలు మంచి వ్యూహకర్తలే. ఓటర్లను అకర్షించడంలో ఒకరికి మించిన వారు మరొకరు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 45 వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అభ్యర్థులిద్దరూ ఇదే వర్గానికి చెందినవారు కావడంతో ఈ ఓట్లు రాబట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. వీరికితోడు మైనార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూడా అధికంగానే ఉన్నాయి. 
 
అయితే, మహా కూటమి తరపున నామా నాగేశ్వర రావు పోటీ చేస్తుండటం అదనపు బలం కాగా, కేవలం తెరాస సర్కారు అభివృద్ధిని మాత్రమే పువ్వాడ అజయ్ నమ్ముకుని బరిలోకి దిగుతున్నారు. అజయ్ తండ్రి సీనియర్ కమ్యూనిస్టు నేత పువ్వాడ నాగేశ్వర రావు కూడా మహాకూటమి తరపున ప్రచారం చేసే అవకాశం వుంది. దీంతో తండ్రీకొడుకుల మధ్య ఖమ్మం అసెంబ్లీ ఎన్నికలు వైరం తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు. అలాగే, నామా తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. సినీ నటుడు బాలకృష్ణ కూడా ప్రచారం చేయనున్నారు. 
 
ఖమ్మం బరిలో ఉన్న అజయ్ కుమార్ గెలుపు బాధ్యతలను తెరాస అధినాయకత్వం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అప్పగించింది. దీంతో ఆయన ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా, ఖమ్మం కార్పొరేషన్‌లో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. వీటిలో 34 వార్డుల్లో తెరాస అభ్యర్థులు గెలుపొందగా, ఆ తర్వాత 9 మంది కార్పొరేటర్లు తెరాస వైపుకు వచ్చారు. దీంతో 43 మంది వార్డుల తెరాస వశంలో ఉన్నాయి. ఫలితంగా ఇరు పార్టీల నేతలూ కార్పొరేషన్‌పైనే అధికంగా దృష్టిని కేంద్రీకరించాయి. అదేసమయంలో గెలుపోటములను శాసించే కమ్మ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు వారు ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారు. 
 
ఇకపోతే, ఖమ్మం సెగ్మెంట్‌లో మొత్తం 2.58,440 మంది లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,15,000 లక్షల ఓటర్లు పట్టణ ప్రాంతంలోనే ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,25,186 మంది పురుషులు కాగా, 1,33,217 మంది స్త్రీలు, 37 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఇందులో కులాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే మైనారిటీలు 38 వేలు, కమ్మలు 45 వేలు, రెడ్డిలు 20 వేలు, ఎస్సీలు 18 వేలు, ఎస్టీలు 15 వేలు, బీసీలు, ఇతర కులాల ఓటర్లు 1,25,00 మంది ఓటర్లు ఉన్నారు. 
 
గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ కుమార్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మొత్తం 2,64,079 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,84,478 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అజయ్‌కు 70,465 ఓట్లు, తుమ్మల నాగేశ్వర రావు(టీడీపీ)కు 64,783 ఓట్లు, ఆర్జేసీ కృష్ణ (తెరాస)కు 14,065, వైకాపా నుంచి పోటీ చేసిన కె.నాగభూషణంకు 25,032 ఓట్లు పోలయ్యాయి.