బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:45 IST)

నాలుగు రోజుల్లో రూ.759 కోట్ల మద్యం విక్రయాలు

నూతన సంవత్సర పార్టీలకు అనుమతి లేకపోయినా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మందు బాబులు ఇళ్లల్లోనే మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు రూ.759 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఆబ్కారీ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 8.61 కోట్ల లిక్కర్‌ కేసులు, 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడుపోయాయి.
 
గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.200 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ 28వ తేదీన రూ.205.18 కోట్లు, 29న రూ.150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31వ తేదీన రూ.193 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 
 
ఉమ్మడి జిల్లాల వారీగా.. కరీంనగర్‌ జిల్లాలో రూ.50.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 52.70 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.47.78 కోట్లు, మెదక్‌లో రూ.53.87 కోట్లు, నల్గొండలో రూ.75.98 కోట్లు, నిజామాబాద్‌ జిల్లాలో రూ.37.5 కోట్లు, వరంగల్‌లో రూ.63.49 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
 
నూతన సంవత్సర వేడుకలకు అనుమతించకపోయినా గతేదాడి కంటే ఈసారి మద్యం విక్రయాలు భారీగానే జరిగినట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది పార్టీలకు అనుమతించని పోలీసులు ప్రమాదాల నివారణకు విస్తృత డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. 
 
హైదరాబాద్‌లో బేగంపేట్‌ ఫ్లైఓవర్‌ మినహా తెలుగుతల్లి, బషీర్‌భాగ్‌, నారాయణగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్‌లను మూసివేశారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, దుర్గం చెరువు తీగల వంతెనపైకి రాత్రి వాహనాలను అనుమతించలేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను పరిశీలించిన సీపీ సజ్జనార్‌.. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకోవద్దని వాహనదారులకు సూచించారు.