1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (19:33 IST)

తెలంగాణలో నాగసాధువుల శాపాల దాడి... వణికిపోతున్న ఛోటా నాయకులు

బాబాల శృంగార కార్యకలాపాలు ఈ మధ్య వార్తల్లో వీర విహారం చేసాయి. అదేవిధంగా ఇప్పుడు మరికొంత మంది కొత్త తరహాలో నాగసాధువులమంటూ ప్రజా ప్రతినిధులపై విరుచుకుపడుతున్నారు. మాట వినకపోతే శపిస్తామని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరు సాధువులు వివిధ బృందాలుగా ఏర్పడి సంచరిస్తున్నారు. 
 
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రామాల వెంబడి తిరుగుతూ సర్పంచ్‌ల ఇంటికి నేరుగా వెళుతున్నారు. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. పలు పూజలు చేయాలని, చేయకపోతే అరిష్టం అని భయపెడుతున్నారు. కొందరు ఏమీ చేయలేక ఐదు వందలు, వెయ్యి రూపాయలు ముట్టజెపుతున్నారు. తాము నేరుగా కుంభమేళా నుంచి వస్తున్నామని తాము చెప్పినట్లు వినాలని ఆదేశిస్తున్నారు. వినకపోతే శపిస్తామని బెదిరిస్తున్నారు. 
 
కొందరు తిరస్కరించి తమకు ఎలాంటి పూజలు అవసరం లేదని చెబుతున్నా వినడం లేదు. బాధితులు అసహనంతో పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు రంగంలోకి దిగారు. పలు బృందాలను అదుపులోకి తీసుకున్నారు. కానీ వారు చెప్పిన మాటలకు కొంతమంది సర్పంచ్‌లు ఆందోళన చెందుతూనే ఉన్నారు.