కరెంట్ షాక్‌కు యువ రైతు మృతి - మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరెంట్ షాక్‌కు ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన దిగారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన బోనగిరి సతీశ్ (22) అనే యువ రైతు విద్యుదాఘాతానికి గురై మంగళవారం సాయంత్రం మృత్యువాత పడ్డాడు.
జాతీయ రహదారి పక్కనే టోల్ ప్లాజా సమీపంలో పంట రక్షణకై పొలానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. చేతికొచ్చిన కొడుకు కరెంటు కాటుకు బలి కావడంతో కుటుంబసభ్యుల రోదనలుమిన్నంటాయి.
ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, గ్రామస్థులు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మృతి చెందిన యువ రైతు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద ఆందోళన అధికారులెవరూ స్పందించకపోవడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట మృతదేహంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు.
ఒకానొక దశలో అధికారులకు.. గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని డీఈ మధుసూదన్ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.