శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (09:40 IST)

ఎంసెట్‌లో ఇంటర్ మార్కులు వెయిటేజీ ఎత్తివేత

eamcet
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణా ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేసింది. దీంతో ఇకపై ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులను కేటాయించనుంది. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీని ఇస్తూ వచ్చారు. ఇపుడు దీన్ని తొలగిస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రద్దు వెనుక అనేక కారణాలతో నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
 
అందువల్ల ఇకపై ఇంటర్ మార్కులతో ఎలాంటి సంబంధం లేకుండా ఎంసెట్ మార్కులను కేటాయించనున్నారు. ఎంసెట్‌‍లో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ మేరకు ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, జేఈఈ మెయిన్, నీట్‌సోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించిన విషయం తెల్సిందే. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. అయితే, ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయడం లేదు. ఒక వేళ  విడుదల చేసినా ఎంసెట్ అధికారులకు ఆయా బోర్డులో అందజేయడం లేదు. 
 
దీంతో వెయిటేజీ మార్కుల ఆధారంగా ర్యాంకుల కేటాయింపు సమస్యగా మారింది. దీంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించారు. కాగా గత 2020 నుంచి 2022లోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇవ్వలేదు. ఇపుడు దీన్ని శాశ్వతంగా తొలగించారు.