శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (10:19 IST)

ఎస్ఐ - కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రిలిమ్స్ పరీక్షలో వివాదాస్పదమైన ఏడు ప్రశ్నల విషయంలో ఉదారంగా స్పందించింది. ఈ ఏడు ప్రశ్నలకు మార్కులు వేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, ప్రిలిమ్స్‌లో తప్పు ప్రశ్నలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారు ఆందోళనకు కూడా దిగారు. బీజేవైఎం శ్రేణులు కూడా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు అండగా నిలించారు. దీంతో దిగివచ్చిన బోర్డు.. కొత్తగా ప్రశ్నలకు మార్కులు జోడించి, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 30వ తేదీ లోపు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఏ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు పార్ట్-2 కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అయితే, ఇదివరకే పీఈటీ, పీఎంటీ టెస్టులో అర్హత సాధించిన వారు పార్ట్-2కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. పార్ట్-2 దరఖాస్తులు ఫిబ్రవరి ఒకటో తేదీన నుంచి ఫిబ్రవరి 5వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.