85 ఏళ్ల వృద్ధురాలికి బియ్యం-కిరోసిన్ ఇచ్చి వండుకోమన్నాడు... ఆమె అలా చేసింది...
కొడుకు భారంగా భావిస్తున్నాడని ఆవేదన చెందిన ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదంతం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే 85 ఏళ్ల అందే కౌసల్య అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కొడుకు మరణించడంతో ఆమె ఆరేళ్లుగా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌లో నివసిస్తున్న తన చిన్నకుమారుడు బాస్కర్‌రెడ్డి వద్ద ఉంటోంది.
తల్లిని భారంగా భావించిన అతను, తల్లిని వంతులువారీగా పెద్దకుమారుడి కుటుంబ సభ్యులతోపాటు ఉంచుకోవాలని కోరాడు. దానికి పెద్దకుమారుడి భార్య విముఖత వ్యక్తం చేయడంతో సోమవారం తల్లిని పెద్ద కుమారుడి ఇంటి వద్ద విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున చిన్న కుమారుడు గ్రామంలోని తన ఇంట్లోనే తల్లిని వేరుగా ఉంచి బియ్యం కిరోసిన్ అప్పగించి వండుకోమని చెప్పాడు.
కొడుకు ప్రవర్తనకు మనస్థాపం చెందిన వృద్ధురాలు అతను ఇచ్చిన కిరోసిన్‌నే ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. ఈ ఘటనపై దుబ్బాక ఎస్‌ఐ సుబాష్‌గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.