గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (10:23 IST)

పేదలకు - ఉపాధి కోల్పోయిన వారికి ఉచిత రేషన్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికితో పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రేషన్ జూన్, జూలై నెలల్లో ఇవ్వనుంది. జూన్ నెలలో 15 కేజీల బియ్యం, జులైలో 5 కేజీల బియ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
పేదల ఆకలి తీర్చడంలో సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 35 కేజీలకు అదనంగా మరో 10 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 10 కిలోలకు అదనంగా మరో 10 కిలోలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 
 
ఆహారభద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఎప్పటిలాగే ఇచ్చే 6 కిలోలకు మరో తొమ్మిది కలిపి 15 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. వచ్చే నెల ఇచ్చే బియ్యంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 87.42 లక్షల రేషన్‌ కార్డుదారులైన 2.79 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టనున్నారు.