శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (10:17 IST)

బెట్టువీడని తెలంగాణ.. మెట్టు దిగిన ఆంధ్ర - ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ రూట్లు ఇవే...

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా లాక్డౌన్ తర్వాత దశల వారీగా బసులు నడిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే రూట్లు, కిలోమీటర్లపై ఒప్పందం కుదరలేదు. దీంతో గత కొన్ని నెలలుగా ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు ఆగిపోయివున్నాయి. 
 
ఈ క్రమంలో హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బ‌స్ భ‌వ‌న్‌లో తెలంగాణ‌, ఏపీ ఆర్టీసీ ఎండీల కీల‌క భేటీ జ‌రిగింది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య అంత‌ర్ రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌పై కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్ప‌టికే ఇరు రాష్ట్రా ఆర్టీసీ బ‌స్సులు తిప్పే కిలోమీట‌ర్ల‌పై ఏకాభిప్రాయం కుదిరింది. 
 
ముఖ్యంగా, ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌పై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య ఎన్ని కిలోమీట‌ర్లు తిప్పాల‌న్న ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీఎస్ ఆర్టీసీ 1,61,258 కిలోమీట‌ర్లు, తెలంగాణ‌లో ఏపీఎస్ ఆర్టీసీ 1,60,999 కిలోమీట‌ర్ల మేర బ‌స్సుల‌ను తిప్ప‌నున్నాయి. 
 
తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులు అత్యధికంగా విజయవాడ, కర్నూలు రూట్లలో తిరగనున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ఆర్టీసీ 826 బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించ‌గా, తెలంగాణ‌లో ఏపీ 638 బ‌స్సుల‌ను న‌డ‌ప‌నుంది. ఇక తెలంగాణ ఆర్టీసీ విజ‌య‌వాడ రూట్‌లో 273 బ‌స్సుల‌ను న‌డ‌ప‌నుంది. అదే రూట్‌లో ఏపీ 192 బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది.
 
విజయవాడ మార్గంలో మొత్తం 273 టీఎస్ఆర్టీసీ బస్సులు 52,944 కిలోమీటర్లు తిరగనున్నాయి. కర్నూలు రూట్‌లో 213 బస్సులు 43,456 కిలోమీటర్లు తిరగనున్నాయి. పిడుగురాళ్ల - గుంటూరు మార్గంలో 67 బస్సులు 19,044 కిలోమీటర్లు, మాచర్ల రూట్‌లో 66 బస్సులు 14,158 కిలోమీటర్లు తిరుగుతాయి.
 
ఇక నూజివీడు, తిరువూరు, భద్రాచలం మార్గంలో 48 బస్సులు 12,453 కిలోమీటర్లు, ఖమ్మం, జంగారెడ్డి గూడెం రూట్‍‌లో 35 బస్సులు 9,140 కిలోమీటర్లు, శ్రీశైలం రూట్లో 62 బస్సులు 1,904 కిలోమీటర్లు, సత్తుపల్లి, ఏలూరు రూట్లో 62 బస్సులు 8,159 కిలోమీటర్ల దూరం ఏపీలో ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు.
 
కాగా, విజయవాడ, కర్నూలు, మాచర్ల, సత్తుపల్లి మార్గాల్లో ఏపీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శ్రీశైలం నుంచి తెలంగాణలోకి వచ్చేలా ఒక్క బస్సు కూడా నడవబోవడం లేదు. ఖమ్మం - జంగారెడ్డి గూడెం, నూజివీడు - భద్రాచలం రూట్లో మాత్రం ఏపీ బస్సుల సంఖ్యే అధికం.