శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (09:57 IST)

బీమా సొమ్ములకు ఆశపడి భర్తతో కలిసి తండ్రిని చంపేసిన కుమార్తె!

బీమా సొమ్ములకు ఆశపడిన ఓ కుమార్తె.. తన భర్తతో కలిసి తండ్రిని హత్య చేసింది. ఈ కేసులో మృతుడి కుమార్తె, అల్లుడుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
నాగార్జునసాగర్‌ సీఐ గౌరునాయడు వెల్లడించిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండాకు చెందిన బిక్నానాయక్ ‌(45).. తన కుమార్తె బుజ్జిని దామరచర్ల మండలం పుట్టలతండాకు చెందిన భాష్యానాయక్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. అనంతరం 2015 ఫిబ్రవరిలో బిక్నానాయక్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన కారణంగా మృతిచెందారని అప్పట్లో కేసు నమోదైంది. 
 
అయితే, ఇటీవలి కాలంలో బీమా డబ్బుల కోసం హత్య కేసులు వెలుగుచూడటంతో పోలీసులు అనుమానం ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారు. బిక్నానాయక్‌ కేసు కూడా తిరిగి విచారణ చేపట్టగా భాష్యానాయకే మామను హతమార్చినట్లు తేలింది. తన భార్య బుజ్జిని నామినీగా పెట్టి మామ బిక్నానాయక్‌పై పలు పాలసీలు చేయించాడు. 
 
ఒకరోజున మామకు మద్యం తాగించి హత్యచేశాడు. తర్వాత రవి, రాజేశ్వర్‌రావు, నరేష్‌తో కలిసి ట్రాక్టర్‌తో తొక్కించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా మూడు ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఐదు పాలసీల ద్వారా రూ.79.65 లక్షలు తీసుకున్నాడని సీఐ వివరించారు. నిందితులైన భాష్యానాయక్‌, రవి, రాజేశ్వరరావు, నరేష్‌, బుజ్జిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు. ఇందులో బీమా ఏజెంట్ల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.