మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (15:34 IST)

'జీహెచ్ఎంసీ పోల్ పంచాయతీ' : అన్‌లాక్-4 ఆంక్షల సడలింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగరా మోగడంతో అన్‌లాక్-4 ఆంక్షల్లో కొన్నింటిని సడలించింది. ఈ సడలింపుతో జీహెచ్ఎంపీ ఎన్నికల్లో జన సమీకరణతో పాటు.. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు లభించనుంది. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఈ మేరకు గత నెల 7న జారీ చేసిన అన్‌లాక్-4 జీవో (136)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల జన సమీకరణకు ఈ ఆంక్షలు అడ్డంకిగా మారకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో 100 మందికి మించకుండా సామాజిక / విద్య / క్రీడలు / వినోదం / స్కృతిక / మత / రాజకీయ కార్యక్రమాలు, ఇతర సామూహిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఇప్పటికే అనుమతులున్నాయి. 
 
అయితే కొన్ని షరతుల మేరకు కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపలి ప్రాంతాల్లో 100 మందికి మించిన సామర్థ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఇకపై అనుమతిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
అయితే, కొన్ని షరతులను విధించారు. నాలుగు గోడల లోపలి (క్లోజ్డ్‌ స్పేసెస్‌) ప్రాంతాల్లో 50 శాతం సామర్థ్యం మేరకు గరిష్టంగా 200 మందికి మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్‌ / శానిటైజర్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
 
అలాగే, బహిరంగ ప్రదేశాల్లో (ఓపెన్‌ స్పెసెస్‌) స్థల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు / పోలీసు కమిషనర్లు / ఎస్పీలు / స్థానిక సంస్థలు అధిక మందిని అనుమతించవచ్చు. అయితే మాస్కులతో పాటు భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్‌ / శానిటైజర్‌ వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.