శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (12:37 IST)

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పోచారం : లక్ష్మీపుత్రుడన్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరుగగా, పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో పోచారం సభాపతి కుర్చీలో కూర్చొని సభా కార్యక్రమాలను కొనసాగించారు. 
 
ఇదిలావుంటే, పోచారం సేవలను గుర్తు చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన పోచారం తనకు పెద్దన్నలాంటివారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవి, టీడీపీ సభ్యత్వానికి పోచారం రాజీనామా చేశారని  ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
 
పోచారం గతంలో ఎన్నో సమర్థమైన పదవులు చేపట్టారని గుర్తు చేసిన సీఎం కేసీఆర్... పోచారం వ్యవసాయ శాఖామంత్రిగా ఉన్న సమయంలోనే ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచమంతా గుర్తించిన రైతుబంధు పథకాన్ని అమలు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. ఇపుడు ఈ రైతుబంధు పథకం ఎన్నో రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని సభకు సీఎం కేసీఆర్ తెలిపారు.